సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు బకాయిల ముందస్తు చెల్లింపులకు సంబంధించి "లెటర్ ఆఫ్ క్రెడిట్-ఎల్ సీ” ఇవ్వాలని... రాష్ట్ర డిస్కంలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ "పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్" లేఖ రాసింది. అలా చేయకుంటే విద్యుత్ ఎక్స్చేంజ్ నుంచి బహిరంగ మార్కెట్లో కరెంటు కొనుగోలును ఈ నెల 16 నుంచి నిలువరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై ఏపీఎస్ పీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్ సీఎండీలు అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం విచారణ జరిపింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ, పీఎస్ వీసీఎల్ తరఫున సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ వాదనలు వినిపించారు. వివరాలు సమర్పణ, కౌంటర్ దాఖలుకు గడువు కోరారు.
పిటిషనర్ సంస్థల తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ... పవన, సౌర విద్యుత్ ఉత్పత్తి కంపెనీలకు ఎల్ సీ ఇవ్వకపోతే కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీచేస్తూ లేఖ పంపిందన్నారు. పవన, సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో ఎల్ సీ నిబంధన ఉన్నప్పటికీ... ఆ సంస్థలు ఒత్తిడి చేయలేదన్నారు. ఉత్పత్తి సంస్థలు సమర్పించే బిల్లులను, నిధుల లభ్యత ఆధారంగా చెల్లిస్తున్నట్లు వివరించారు. బకాయిల చెల్లింపులలో డిస్కంల ప్రతిపాదనను అంగీకరిస్తూ... సౌర విద్యుత్ యూనిట్‌కు 2 రూపాయల 44 పైసలు, పవన విద్యుత్ యూనిట్‌కు 2 రూపాయల 48 పైసల చొప్పున చెల్లించేందుకు ఇటీవల హైకోర్టు ఆమోదించిందని గుర్తు చేశారు. అలాంటి సమయాన ఎల్ సీ విషయంలో కేంద్ర ప్రభుత్వ జోక్యానికి వీల్లేదన్నారు.
బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేయకుండా నిలువరిస్తే ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. "పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్" రాసిన లేఖ అమలును నిలుపుదల చేశారు. బహిరంగ మార్కెట్లో ఎక్స్ఛేంజ్ ద్వారా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో జోక్యం చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. విచారణను నవంబర్ 5కు వాయిదా వేశారు.