డాక్టర్ సుధాకర్(Doctor Sudhakar) విషయంలో దాఖలు చేసిన తుది నివేదికను అందజేయడానికి అభ్యంతరం లేదని.. సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అమికస్ క్యూరీ అందుబాటులో లేకపోవడంతో విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. సీఐబీ తరఫు న్యాయవాది చెప్పిన వివరాల్ని నమోదు చేసింది . హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
డాక్టర్ సుధాకర్‌తో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగ్‌ను జత చేస్తూ తెదేపా మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించిన న్యాయస్థానం విచారణ జరిపింది. గతేడాది మే 22న దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. 2020 నవంబర్ 24న సీబీఐ.. తుది స్థాయి నివేదికను సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించింది. ఆ నివేదికను పరిశీలించిన ధర్మాసనం.. సంతృప్తికరంగా లేకపోవడంతో అదనపు డైరెక్టర్ స్థాయికి తగ్గని అధికారి ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేసి నివేదిక ఇవ్వాలని గతేడాది డిసెంబర్లో ఆదేశాలిచ్చింది. తాజాగా జరిగిన విచారణలో తుది నివేదిక ప్రతిని ఈ కేసులో అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాదికి అందజేయడానికి అభ్యంతరం లేదని సీబీఐ తరపు న్యాయవాది చెన్న కేశవులు తెలిపారు . ఇప్పటికే తుది నివేదికను న్యాయస్థానం ముందు ఉంచామన్నారు. ప్రభుత్వం తరపున ప్రత్యేక సీనియర్ కౌన్సిల్ ఎస్.ఎస్.ప్రసాద్, జీపీ వివేకానంద వాదనలు వినిపించారు. డాక్టర్ సుదాకర్ ఇటీవల గుండెపోటుతో కన్నుమూశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. సీబీఐ నివేదికను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ నివేదికపై సందేహాలు లేవనెత్తితే వివరణ ఇస్తామన్నారు.
ఇదీ చదవండి: AFFIDAVIT IN SC: పది, ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం అఫిడవిట్