రైతు చట్టాల రద్దు కోసం రైతులు జరిపిన పోరాటం ప్రపంచ ఉద్యమ చరిత్రలో నిలిచిపోతుందని పలువురు హైకోర్టు న్యాయవాదులు కొనియాడారు. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించటం రైతుల పోరాట విజయం అన్నారు. హైకోర్టు ఆవరణలోని జాతీయ జెండా వద్ద విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. పౌరహక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది నంబూరి శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద ప్లకార్డులు పట్టుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అన్ని అప్రజాస్వామిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు చట్టాలు రద్దు...
సాగు చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. వీటిని వ్యతిరేకిస్తూ దిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన ఈనెల 26 నాటికి ఏడాది పూర్తికానున్న తరుణంలో కీలక నిర్ణయం తీసుకొంది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తూ- మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు. దేశంలోని చిన్న, సన్నకారు రైతుల కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించేందుకు సంపూర్ణ సదుద్దేశంతో ఈ చట్టాలను తీసుకొచ్చామని, అయినప్పటికీ కొందరు రైతులను ఒప్పించలేకపోయామని ఆయన పేర్కొన్నారు.
దేశ ప్రజలను క్షమాపణ కోరుతున్నా. మంచి మనసుతో, పవిత్ర హృదయంతో ఓ విషయం చెప్పదలచుకున్నా. బహుశా మా తపస్సులో ఏదో లోపం ఉండి ఉండొచ్చు. అందుకే దీపం లాంటి సత్యం గురించి కొందరు రైతు సోదరులకు అర్థమయ్యేలా చెప్పలేకపోయాం. ఈరోజు గురునానక్ దేవ్ పవిత్ర ప్రకాశ దినోత్సవం. ఇది ఎవర్నీ తప్పుపట్టే సమయంకాదు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం.అన్నదాతల పరిస్థితులను మెరుగుపరిచేందుకే మూడు సాగు చట్టాలను తెచ్చాం. బడుగు రైతులకు మరింత శక్తినివ్వాలని, వారి ఉత్పత్తులకు మంచి ధరలు దక్కేలా చేయాలనే వీటిని రూపొందించాం. రైతులు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తల నుంచి ఏళ్ల తరబడి వినిపించిన డిమాండే ఇది. గత ప్రభుత్వాలెన్నో వీటిపై మథనం చేశాయి. కానీ, మేము పార్లమెంటులో చర్చించి, వీటిని తీసుకొచ్చాం.మేం ఏంచేసినా అది రైతుల కోసమూ, దేశం కోసమే. మీ అందరి ఆశీర్వాదంతో నా శ్రమలో లోపం లేకుండా చూసుకున్నా. మీ కలలు, దేశం కలలు సాకారం చేయడానికి ఇకముందూ మరింత శ్రమిస్తానని ప్రమాణం చేస్తున్నా.
- ప్రధాని మోదీ
స్వాగతించిన నేతలు...
సాగు చట్టాలను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను వేర్వేరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఎన్నికల గిమ్మిక్కుగా కొందరు అభివర్ణించగా.. మరికొందరు అన్నదాతల అద్భుత పోరాటానికి ప్రతీకగా పేర్కొన్నారు.
'ప్రకాశ్ దివస్'(prakash diwas 2021) రోజున శుభవార్త విన్నామని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal news) అన్నారు. వీటిని రద్దు ముందే చేసి ఉంటే 700మంది రైతుల ప్రాణాలు నిలిచేవని వ్యాఖ్యానించారు. ప్రాణాలను లెక్కచేయని అన్నదాతల పోరాటాలు తరతరాలు గుర్తుంటాయని పేర్కొన్నారు.
"మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు ఫలితం దక్కింది. వ్యవసాయం, రైతుల సంక్షేమం కోసం ఈ దేశ అన్నదాతలు ప్రాణాలకు తెగించి పోరాడిన తీరును భవిష్యత్తు తరాలు ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి. దేశ రైతులకు సెల్యూట్."
-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
దేశ, రైతు ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం స్వాగతించదగినదని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్(odisha cm twitter) పేర్కొన్నారు. బీజేడీ(naveen patnaik party) మొదటినుంచి రైతులకు అండగా నిలుస్తోందన్నారు.
"రైతులారా మీ సాగుభూమితో పాటు, మీ కుటుంబాలు చాలా కాలంగా మీ కోసం ఎదురుచూస్తున్నాయి. మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానించేందుకు మీ వాళ్లు వేచిచూస్తున్నారు."
-నవీన్ పట్నాయక్, ఒడిశా సీఎం
ఇవీచదవండి.