స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వ కార్యాలయాలకు అధికార పార్టీ రంగులు వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో ఉంచింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీకే మహేశ్వరి, జస్టిస్ ఎన్. జయసూర్య ధర్మాసనం వాదనలు వింది. గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయానికి అధికార వైకాపా జెండా రంగులేయడాన్ని ఆ గ్రామానికి చెందిన రైతు ముప్ప వెంకటేశ్వరరావు హైకోర్టులో సవాల్ చేశారు. పంచాయతీ కార్యాలయాలకు పార్టీ రంగులేయొద్దని కోర్టు ఆదేశించిన తర్వాత కూడా విజయనగరం జిల్లా లక్కవరపుకోట తలారి గ్రామంలో అదే పని చేశారంటూ.. రమణ అనే వ్యక్తి మరో వ్యాజ్యం దాఖలు చేశారు.
వైకాపా రంగులు పోలి ఉన్నాయంతే: ప్రభుత్వ న్యాయవాది
ఈ వ్యాజ్యాలపై పిటిషనర్ల తరపు న్యాయవాది పాణిని సోమయాజి వాదనలు వినిపిస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీ రంగులైనా వేయడానికి వీల్లేదన్నారు. 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా అధికార పార్టీ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని వినియోగించకూడదని కోర్టు తెలిపారు. ప్రభుత్వం తరఫు అదనపు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ కార్యాలయాలకు ఏ రంగు వేసినా దానిని ఫలానా పార్టీ రంగు అని ఆపాదిస్తున్నారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వేసివని వైకాపా పార్టీ రంగులు వైకాపా రంగులను పోలి ఉన్నాయన్నారు. పంచాయతీరాజ్‌శాఖ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, కమిషనర్ ఆదేశాల రంగులు వేశారన్నారు.
ఎన్నికల సంఘంపై కోర్టు ఆగ్రహం
రాష్ట్ర ఎన్నికల సంఘం తరపున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తమ చర్యలు ఉంటాయన్నారు. ఈ వాదనలపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేస్తూ, స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కోడ్ అమల్లోకి వచ్చాక చర్యలు తీసుకుంటామంటే ఎలా అని ప్రశ్నించింది. కేంద్ర ప్రభుత్వం తరపున సహాయ సొలిసిటర్ జనరల్ కృష్ణమోహన్ వాదనలు వినిపిస్తూ, ప్రకటనల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల్ని కోర్టుకు వివరించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనం వినియోగించకూడదని సుప్రీం పేర్కొందన్నారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది.
ఇదీ చదవండి: