విజయ డెయిరీ ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. 9వ షెడ్యూలులోని ఈ సంస్థ ఆస్తి , అప్పుల మదింపులో కంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ( కాగ్ ) సాయం తీసుకోవాలని, దాని సహకారంతో ఆస్తి అప్పుల పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. ఈ విభజన పూర్తయ్యేదాకా తెలంగాణ ప్రభుత్వం బ్యాంకు ఖాతాలను నిర్వహించడానికి వీల్లేదంది. విజయ డెయిరీకి చెందిన సోమాజిగూడలోని అతిథి గృహం, నిర్వహణ కార్యాలయాలను జనాభా ప్రాతిపదికన విభజన జరగాల్సి ఉందని పేర్కొంది. పాల ఉత్పత్తులకు సంబందించిన కేంద్రాలు ఆయా భౌగోళిక ప్రాంతాల ఆధారంగా ఉంటుందని, ఈ మేరకు లాలాపేటలోని ఉన్న పాల ఉత్పత్తుల కేంద్రం హెడ్ క్వార్టర్ లో ఉన్నందున కామన్ ఫెసిలిటీగా రెండు రాష్ట్రాలకు వర్తిస్తుందన్న ఏపీ అడ్వొకేట్ జనరల్ వాదనను తోసిపుచ్చింది. ఇది హైదరాబాద్‌లో ఉన్నందున తెలంగాణకే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆస్తి అప్పుల పంపిణీ జరగకుండా అతిథిగృహం, ప్రధాన కార్యాలయం, లాలాపేటలోని పాల ఉత్పత్తుల కర్మాగారాలను తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ( టీఎస్ డీడీసీఎల్) కు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 8 చట్టవిరుద్ధమని , అది చెల్లదని తీర్పులో స్పష్టం చేసింది.
ఈ జీవోకు వివరణ ఇస్తూ , తాత్కాలిక నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కార్యాలయాలు, ఫ్యాక్టరీ నిర్వహణను 'టీఎస్డీడీసీఎల్ 'కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 17కు ఏపీఎస్డీడీసీఎల్ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదంది. 9వ షెడ్యూలులోని సంస్థల ఆస్తి , ఆప్పుల పంపిణీలో కేంద్రానికి పరిధి లేదని తేల్చి చెప్పింది . ఏదైనా వివాదం తలెత్తినప్పుడు పరిష్కరించడం వరకే కేంద్రం పరిధి ఉంటుందంది. ఈ ఆస్తి అప్పుల పంపిణీకి సంబంధించి జోక్యం చేసుకునే పరిధి తెలంగాణ హైకోర్టుకు ఉందని తేల్చి చెప్పింది .
జరిగింది ఇలా..
తెలంగాణ లాలాపేటలోని ఏపీ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య-విజయ డెయిరీకి (ఏపీఎస్డీడీసీఎన్ఎల్)కు చెందిన కర్మాగారం, సోమాజిగూడలోని అతిథిగృహం, పరిపాలనా కేంద్రాలను టీఎఎస్డీడీసీఎఫ్ఎల్కు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2018 మే 8న జారీ చేసిన జీవో 8ను సవాలు చేస్తూ ఏపీ కార్పొరేషన్ ఎండీ 2016లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు, జస్టిస్ టి . వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ ఎస్ . శ్రీరాం వాదనలు వినిపిస్తూ ఏపీ అనుమతి లేకుండా లాలాపేట్‌లోని ఫ్యాక్టరీ భవనాలను తెలంగాణ డెయిరీకి కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేయడం చెల్లదన్నారు. ఈ వాదనతో తెలంగాణ ఏజీ బీఎస్.ప్రసాద్ విభేధిస్తూ ఆ కర్మాగారం కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రజల అవసరాలకేనన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆస్తి, అప్పుల విభజన జరిగే దాకా యథాతథస్థితిని కొనసాగించాలని, ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకోరాదని కేంద్రం స్పష్టం చేసిందని సహాయ సొలిసిటర్ జనరల్ ఎన్.రాజేశ్వరరావు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం గత నెల 25న తీర్పును వాయిదా వేసి ఇటీవల వెలువరించింది.
ఇదీ చదవండి: తిరుపతిలో బాలుడి అపహరణ కేసులో పురోగతి