మాన్సాస్ ట్రస్టు ఛైర్‌పర్సన్‌గా సంచైత గజపతిరాజును నియమించే వ్యవహారంలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడి జీవోలు జారీచేసిందని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ప్రతి దశలోనూ చట్టవిరుద్ధంగా వ్యవహరించిందని ఆక్షేపించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం.వెంకటరమణ సోమవారం వెల్లడించిన తీర్పు ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది.
మాన్సాస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్న అశోక్‌గజపతిరాజును తొలగించి ఆ స్థానంలో సంచైత గజపతిరాజును నియమించడానికి ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని న్యాయమూర్తి తప్పుబట్టారు. సంచైత, మరో ఇద్దర్ని ట్రస్టు వ్యవస్థాపక కుటుంబసభ్యులుగా గుర్తిస్తూ, ఆమెను ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతేడాది మార్చి 3న జీవో జారీ చేసేనాటికి అశోక్‌గజపతిరాజుకు వ్యవస్థాపక కుటుంబసభ్యునిగా గుర్తింపు ఉందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ట్రస్టీ షిప్‌నకు ఖాళీ ఏర్పడినప్పుడే ఛైర్మన్ నియామకం చేపట్టాలని దేవాదాయ చట్ట నిబంధనలు చెబుతున్నాయన్నారు. పీవీజీ రాజు రెండో కుమారుడిగా మాన్సాస్ ట్రస్టుకు ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు నియమితులయ్యారని గుర్తుచేశారు. అవసరం లేకుండా సంచైత, మరో ఇద్దర్ని వ్యవస్థాపక కుటుంబసభ్యులుగా గుర్తించడం సరికాదన్నారు. అలా గుర్తించే సమయంలో అధికారులు దేవాదాయ చట్టంలోని సెక్షన్ 17(3) విధానాన్ని అనుసరించలేదన్నారు.
* అశోక్‌గజపతిరాజు స్థానంలో సంచైత గజపతిరాజును ఉంచడానికి గల కారణాన్ని ప్రభుత్వం జీవోల్లో పేర్కొనలేదన్నారు. చాలాకాలంగా ఆయన ఛైర్మన్ స్థానంలో ఉన్నారనే చెప్పారన్నారు. ఆ కారణంతో అశోక్‌గజపతిరాజును తొలగించడానికి వీల్లేదన్నారు.
* ఆయన్ని తొలగించడానికి ముందు నోటీసులు ఇవ్వలేదని, అది సహజన్యాయసూత్రాలకు విరుద్ధమని అన్నారు. ఇదంతా అశోక్‌గజపతిరాజు హక్కులపై ప్రభావం చూపుతుందన్నారు.
* జీవోల జారీ అనుమానాలకు తావిస్తోందన్నారు. సంచైతను ఛైర్మన్ స్థానంలో కూర్చోబెట్టడానికే జీవోలు తెచ్చినట్లు అర్థం అవుతోందన్నారు. ఈ క్రమంలో ఊర్మిళ గజపతిరాజు, ఆర్‌వీ సునీత ప్రసాద్ ప్రభుత్వం, అధికారుల చేతుల్లో పావులుగా మారారన్నారు.
* అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడానికి వీల్లేదని, ఇలాంటి వ్యవహారాల్లో దేవాదాయ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాలని ప్రభుత్వం చేసిన వాదనలను తోసిపుచ్చారు.
* అశోక్‌గజపతిరాజును అనవసరంగా ఈ వివాదంలోకి లాగినందుకు ప్రతివాదుల నుంచి ఆయన ఖర్చులు పొందేందుకు ఇది తగిన కేసని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఖర్చులు ఇవ్వాలని అశోక్‌గజపతిరాజు పిటిషన్లో కోరలేదు కాబట్టి ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు.
ఇదీ చదవండి:
AP High Court: గ్రూప్-1పై వ్యాజ్యాల్లో వాదనలు పూర్తి..మధ్యంతర ఉత్తర్వులపై నిర్ణయం వాయిదా