రాష్ట్రంలోని డెయిరీ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ఆస్తులను లీజు విధానంలో అమూల్ సంస్థకు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని , ఈ నెల4 న మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ మంత్రివర్గ నిర్ణయాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు . అమూల్ కు డెయిరీ ఆస్తులు అప్పగించే విషయంలో మంత్రివర్గ నిర్ణయం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని అభ్యర్థించారు. తాజాగా ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చింది.
వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది హాజరు కానున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది బొద్దులూరి శ్రీనివాసరావు ధర్మాసనానికి తెలిపారు. ప్రస్తుతం ఆయన వేరే కోర్టులో విచారణలో ఉన్నందున కొద్ది సమయం తర్వాత విచారణ జరపాలని లేదా ఈ నెల 20 కు వాయిదా వేయాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ స్పందిస్తూ .. వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ జరపాల్సిన అవసరం లేదు , వేసవి సెలవుల తర్వాత విచారణకు వచ్చేలా వాయిదా వేయాలని కోరారు . ఆ వినతిపై పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. మంత్రివర్గం నిర్ణయం ఆధారంగా ముందుకెళ్లే పరిస్థితి ఉందన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం .. విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతాం .. అప్పటి వరకు మంత్రివర్గం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబోమని కోర్టుకు హామీ ఇస్తారా.. ? అని జీపీని ప్రశ్నించింది . ఆ విధంగా హామీ ఇవ్వలేనని జేపీ బదులిచ్చారు . దీంతో నోటీసులు జారీచేస్తూ విచారణను ఈనెల 20 కి వాయిదా వేసింది .
ఇదీ చదవండి: సీబీఐ కార్యాలయం ముందు టీఎంసీ శ్రేణుల ఆందోళన