కోస్తాంధ్రపై 1500 మీటర్ల ఎత్తున గాలులతో ద్రోణి ఏర్పడిందని.. అది తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య గాలులతో 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉందని వాతావరణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం భారీగా, సోమవారం ఒక మాదిరి వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురవవచ్చన్నారు. ఈ నెల 21న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని చెప్పారు. శుక్రవారం ఉదయం 8 నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకూ పలుచోట్ల భారీవర్షాలు కురిశాయి. అత్యధికంగా మాగనూర్ (నారాయణపేట జిల్లా)లో 13.2, వెల్గొండ (వనపర్తి)లో 12.3, చిన్నచింతకుంట (మహబూబ్‌నగర్)లో 11.8, జక్లేర్ (నారాయణపేట)లో 10.5, కామారెడ్డిగూడెం (నల్గొండ)లో 10.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. వికారాబాద్ మండలం కొటాలగూడ గ్రామ శివారులో శనివారం సాయంత్రం పిడుగుపడి అదే గ్రామానికి చెందిన రైతు రామదాసు(38) మరణించారు. భార్యతో కలిసి పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగిందని ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.
జలాశయాలకు పెరుగుతున్న ప్రవాహం
జూరాల జలాశయానికి ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. ఎగువ నుంచి 83వేల క్యూసెక్కులు వస్తుండడంతో 12 గేట్లను తెరిచారు. 85వేల 98 క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు వదులుతున్నారు. జలాశయ నీటిమట్టం 318.51 మీటర్లు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 318.42 మీటర్లుగా ఉంది. ప్రస్తుతం జలాశయంలో 9.42 టీఎంసీల నీటిని నిల్వ ఉంచారు. తుంగభద్రలో సుంకేసుల జలాశయం నుంచి 2వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు వదులుతున్నారు. ఇవన్నీ కలుపుకుని శ్రీశైలం జలాశయానికి 85వేల క్యూసెక్కులకు పైగా చేరుకుంటున్నాయి. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885అడుగులు కాగా ప్రస్తుతం 812.91 అడుగుల వద్ద ఉంది. జలవిద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి అనంతరం దిగువకు 6,357క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఏపీలోని ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రానికి 7918 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆలమట్టికి వస్తున్న వరదను వచ్చింది వచ్చినట్లే నారాయణపూర్‌కు విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి దిగువకు 51200 క్యూసెక్కులు వస్తున్నాయి.
ఎస్సారెస్పీకి ముందే వచ్చిన ప్రవాహం
శ్రీరాంసాగర్‌కు గతేడాదితో పోల్చితే ముందుగానే ప్రవాహం వచ్చింది. ఈ ప్రాజెక్టు నీటిమట్టం 1091అడుగులకు గాను.. ప్రస్తుతం 1086 అడుగులు ఉంది. జలాశయం పూర్తి నీటి నిల్వ 90.31టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 70.03టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతేడాది జులై 17నాటికి ఈ ప్రాజెక్టులో 35.04టీఎంసీలే నిల్వ ఉన్నాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా ముందుగానే ప్రవాహం వచ్చింది.
ఇదీ చదవండి: Srisailam Dam: శ్రీశైలం జలాశయానికి పోటెత్తెత్తున్న వరద ప్రవాహం..