Telangana Rain Updates: ఝార్ఖండ్‌పై రెండురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా జోరుగా వర్షాలు పడుతున్నాయి. అలాగే రాజధానిలో నిన్న సాయంత్రం వరుణుడు విజృంభించాడు. ప్రధాన నగరంలో రహదారులు జలమయమయ్యాయి. ఖైరతాబాద్, నాంపల్లి, బాలానగర్, చింతల్, సికింద్రాబాద్, బేగంపేట, ప్యాట్నీ, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, తార్నాక, హబ్సీగూడ, మల్లాపూర్, నాచారం, ఎస్ఆర్ నగర్, బోరబండ, అమీర్‌పేట, మియాపూర్, లింగంపల్లి, కూకట్‌పల్లిలో వర్షం కురిసింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్డుపై ప్రవహించడంతో వాహానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఝార్ఖండ్‌పై రెండురోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం మంగళవారం మధ్యప్రదేశ్ పైకి విస్తరించింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఉంది. మరోవైపు బంగాళాఖాతంపై మరో ఉపరితల ఆవర్తనం 4.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడింది. రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో నేడు, రేపు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.
కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరికి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. శ్రీరాంసాగర్‌కు ఎగువ నుంచి వరద ఎక్కువవుతోంది. మంగళవారం నాటికి 12,963 క్యూసెక్కులు వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న కడెం ప్రాజెక్టుకు భారీ వరద వస్తోంది. ఇది మరింత పెరిగే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక్కడి నుంచి అదనపు వరద అంతా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతుంది. మరోవైపు ప్రాణహిత, గోదావరి సంగమం వద్ద ఉన్న కాళేశ్వరంలోని మొదటి బ్యారేజీ లక్ష్మీలోకి వరద పెరుగుతోంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఎగువ నుంచి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ఒక గేటు తెరిచారు. దిగువకు గోదావరిలోకి 3 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని వదులుతున్నారు. మరికొన్ని గేట్లు కూడా తెరిచే అవకాశాలు ఉన్నాయి.
మరోవైపు కృష్ణా ఎగువ ప్రాజెక్టు ఆలమట్టికి ప్రవాహం ప్రారంభమైంది. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు క్రమంగా ప్రవాహం పెరుగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టులోకి కూడా నీరు వస్తోంది. మంగళవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ 526 ప్రాంతాల్లో వర్షపాతం నమోదయింది. అత్యధికంగా కంగ్టి(సంగారెడ్డి జిల్లా)లో 8.7, కొత్తమొల్గర(మహబూబ్‌నగర్)లో 7.9, డిండి(నల్గొండ)లో 7.7, మంగాపూర్(నాగర్‌కర్నూల్)లో 7.5 సెం.మీ. వర్షం కురిసింది.