ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి క్రమంగా అల్పపీడనంగా మారనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ తమిళనాడు తీరానికి దగ్గరగా ఏర్పడనున్న ఈ అల్పపీడనం ఈ నెల 11 తేదీనాటికి వాయుగుండంగా బలపడుతుందని వివరించింది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10, 11వ తేదీల్లో అతి భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ‘ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి 11న తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకుంటుంది. ఈ ప్రభావంతో మంగళవారాల్లో తమిళనాడులోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చు. ఏపీలోని దక్షిణ కోస్తా, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్ద’ని ఐఎండీ సూచించింది.
- చెన్నై సహా ఉత్తర తమిళనాడులోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు కొనసాగాయి. చెన్నై శివారులోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కారణంగా కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి.
లోతట్టు ప్రాంతాలు జలమయం..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో వర్షాలు కురుస్తున్నాయి. స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సత్యవేడు నియోజకవర్గంలోని కే వి పురం మండలంలో వరదనీటి ప్రవాహానికి కాళంగి-శ్రీకాళహస్తి ప్రధాన రహదారిపై కాజ్ వే కోతకు గురైంది. ఆధారం, కాళంగి, హనుమయ్య కండ్రిగ, కండ్లులూరు, రంగయ్య గుంట ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే కెవిబిపురం మండలం కాళంగి రిజర్వాయర్‌కు పదివేల క్యూసెక్కుల వరద నీరు చేరుతుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లును అడుగు మేర ఎత్తి 2 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేశారు. వరద ప్రవాహం అధికమయితే మరింత ఎక్కువ నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టారు.
నెల్లూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షాలకు నెల్లూరు నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు నగరంలోని తల్పగిరి కాలనీ, బాలాజీ నగర్ ప్రాంతాలలో వర్షపు నీరు ఇళ్లల్లో చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని బుజబుజ నెల్లూరు, చంద్రబాబు నగర్ ప్రాంతాలలో ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేట పరిసర మండలాల్లో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగి పారుతున్నాయి. నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లోని గ్రామాల మీదుగా కొనసాగే చావాలి వాగు ఉద్ధృతంగా పారుతోంది.
వర్షాలే.. వర్షాలు..
శనివారం నుంచి కురుస్తున్న వర్షాలు చెన్నైతోపాటు దాని సమీప జిల్లాలను వరదలతో ముంచెత్తుతున్నాయి(chennai floods). చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. చెన్నై పరిసరాల్లోని 3 రిజర్వాయర్ల నుంచి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి కాలనీలన్నీ జలమయమయ్యాయి. కొన్ని చోట్ల కార్పొరేషన్ అధికారులు మోటార్లతో నీటిని తోడుతున్నారు. తమిళనాడుకు మరో నాలుగైదు రోజులు భారీ వర్ష సూచన ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో(tamil nadu floods) అప్రమత్తమైన అధికారులు చెన్నైతోపాటు సరిహద్దు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
ఇదీ చూడండి: