పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీ తీరానికి అత్యంత సమీపంగా కొనసాగుతోంది. ఇది క్రమంగా మరింత బలపడునుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈ ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రత్యేకించి జిల్లాల్లో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలియజేసింది.
ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర, తెలంగాణా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్టు అధికారులు తెలిపారు.
మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గానూ కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గరిసపూడిలో రికార్డు స్థాయిలో వర్షపాతం రికార్డు అయ్యింది. 24 గంటల వ్యవధిలో 21.1 సెంటిమీటర్ల వర్ష కురిసినట్టు వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే కృత్తివెన్ను మండలంలోని ఇతర ప్రాంతాల్లోనూ 20 సెంటిమీటర్ల మేర వర్షపాతం రికార్డు అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 19 సెంటి మీటర్లు, కర్నూలులో 14.7 సెంటిమీటర్ల వర్షం కురిసింది.
ఇదీ చదవండి: