అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేని వర్షంతో రోడ్లపైకి భారీగా నీరు చేరింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నగరంలోని సోమాజీగూడ, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, కూకట్‌పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, మారేడ్‌పల్లి, లింగంపల్లి, మియాపూర్, సనత్‌నగర్, అమీర్‌పేట్, బేగంపేట, ఉప్పల్, హయత్‌నగర్, వనస్థలిపురం, జీడిమెట్ల, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షం కురుస్తోంది.
ఇళ్లలోకి నీరు..
ఉప్పల్, మేడిపల్లి, రామంతాపూర్, బోడుప్పల్, పీర్జాధిగూడ, ఘట్కేసర్, పోచారం ప్రాంతాల్లో వీధుల్లోకి భారీగా వర్షపు నీరు చేరింది. బోడుప్పల్, పీర్జాధిగూడ నగర పాలక సంస్థలు, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల పరిధిలో కొత్తగా ఏర్పాటైన కాలనీల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
నేడు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఇదీచూడండి: సర్కారీ దవాఖానాల్లో రేయింబవళ్లూ వైద్యం.. పేదల్లో ఆత్మస్థైర్యం