సకాలంలో ఆస్తి పన్ను చెల్లించలేని వారిపై పుర, నగరపాలక సంస్థలు విధిస్తున్న వడ్డీ తడిసిమోపెడవుతోంది. గడువులోగా పన్ను చెల్లించనందుకు వడ్డీ మీద మళ్లీ వడ్డీ వేస్తున్నారు. 2021-22లో పన్ను చెల్లించ లేకపోయిన వారికి పుర, నగరపాలక సంస్థలు తాజాగా ఇస్తున్న నోటీసులు చూసి ప్రజల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. పన్ను బకాయిలపై ఏడాదిలో 9 నెలలకు 24 శాతానికిపైగా వడ్డీ విధిస్తున్నారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం అమలులోకి వచ్చాక గత రెండేళ్లుగా ఏడాదికి 15 శాతం చొప్పున ఆస్తి పన్ను పెంచారు. పెరిగిన పన్ను మొత్తానికి సమానమయ్యే వరకు ఏటా 15 శాతం పన్ను వడ్డన కొనసాగుతుంది. దీంతో ఇప్పటికే పట్టణ ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. పన్ను 15 శాతమే కదా పెరిగిందని మొదట భావించిన చాలామంది ఏటా కొనసాగింపు చూసి గగ్గోలు పెడుతున్నారు.
పేద, మధ్య తరగతిపై భారీగా భారం: పెరిగిన నిత్యావసరాలు, విద్యుత్తు ఛార్జీలు, వంట గ్యాస్ ధరలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో కొన్ని కుటుంబాలు గత ఏడాది ఆస్తి పన్ను చెల్లించలేదు. ఇలాంటి వారందరికీ గత ఏడాది బకాయి, వీటిపై వడ్డీతోపాటు ఈ ఏడాది చెల్లించాల్సిన పన్నుకు సంబంధించి పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలు నోటీసులు జారీ చేస్తున్నాయి. ఒకే సారి రూ.వేలల్లో చెల్లించాలన్న నోటీసులు చూసి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఉదాహరణకు విజయవాడలో ఒకరికి ఆస్తి పన్ను రూ.12 వేలు (రెండు అర్థ సంవత్సరాలకు కలిపి) చెల్లించాలని గత ఏడాది వార్డు వాలంటీర్ సమాచారం పంపారు. ఇంటి యజమాని ఆర్థిక ఇబ్బందులతో పన్ను చెల్లించలేదు. దీంతో చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ రూ.2,906 విధించి మొత్తం రూ.14,906 చెల్లించాలని నగరపాలక సంస్థ ఇటీవల నోటీసు పంపింది. ఈ ఏడాది (2022-23) తొలి అర్థ సంవత్సర పన్ను రూ.6 వేలు కలిపి మొత్తం రూ.20,906 చెల్లించాలని ఆయనపై ఉద్యోగులు ఒత్తిడి తెస్తున్నారు.
2 శాతంతో మోత: పుర, నగరపాలక సంస్థలు ఏడాదిలో రెండుసార్లు ప్రజల నుంచి ఆస్తి పన్ను వసూలు చేస్తాయి. తొలి అర్థ సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ మధ్య పన్ను చెల్లిస్తే వడ్డీ ఉండదు. జులై తరువాత నుంచి పన్ను మొత్తంపై 2.01% చొప్పున వడ్డీ మొదలవుతుంది. ప్రతి నెలా వడ్డీ మీద వడ్డీ విధిస్తున్నారు. మార్చి నెలాఖరు నాటికి పన్ను మొత్తంపై వడ్డీ 24.22% శాతానికి చేరుతోంది. గడువులోగా పన్ను చెల్లించనట్లైతే వడ్డీ విధించే విధానం 1994 నుంచి అమలులో ఉంది. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే విధానం 2021-22 నుంచి అమలులోకి వచ్చాక పన్ను ఏటా పెరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒకటి, రెండేళ్లు కూడా పన్ను కట్టని కుటుంబాలు ఉన్నాయి. పన్నులు వెంటనే చెల్లించాలంటూ వార్డు వాలంటీర్లతో అధికారులు ఒత్తిడి తెస్తున్నారని విశాఖకు చెందిన చిరుద్యోగి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను పన్నుల పేరుతో పీడించే చర్యలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఏపీ పట్టణ పౌర సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు.
బాదుడు ఇలా...: విజయవాడలో గత ఏడాది రూ.12,000 ఆస్తి పన్ను బకాయిపడిన ఇంటి యజమానికి నగరపాలక సంస్థ భారీగా వడ్డీ విధించింది. తొలి అర్థ సంవత్సరంలో మొదటి మూడు నెలలకు నిబంధనల ప్రకారం వడ్డీ వేయలేదు. జులై నుంచి మార్చి వరకు వడ్డీపై మళ్లీ వడ్డీ ఇలా విధిస్తూ వెళ్లారు..