హైకోర్టుకు చెందిన ఇద్దరు అధికారులపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రార్ జనరల్ ని ఉన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు . ప్రత్యేక సెల్ ఏఎస్ఓ ఎం.శంకర్ రెడ్డి , డిప్యూటీ రిజిస్టార్ పి.వెంకటరమణపై ఈ మేరకు చర్యలు ప్రారంభించాలని పేర్కొన్నారు. ఆ ఇద్దరి అధికారులపై పరిపాలనాపరమైన తగిన చర్యలు తీసుకునే నిమిత్తం రిజిస్ట్రార్ ఇచ్చిన నివేదికతోపాటు ఈ వ్యవహారాన్ని ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని ఆర్జీని ఆదేశించారు. కోర్టు ధిక్కరణ వ్యాజ్యం విచారణ సందర్భంగా ప్రతివాదులైన అధికారులు స్వయంగా హాజరుకావాలని న్యాయస్థానం ప్రామాణిక రూపంలో జారీచేసే ఫామ్ నెంబర్ వన్ నోటీసులో అదనపు వాక్యాలను చేర్చడం వల్ల హైకోర్టుకు చెందిన ఇద్దరి అధికారులపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ప్రామాణిక విధానంలో ఇచ్చే ఫామ్ నెంబర్ వన్ నోటీసుకు అదనంగా వాక్యాలు చేర్చడం హైకోర్టు రాజ్యాంగబద్ధ విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని స్పష్టంచేశారు. తన నియామకం నాటి నుంచి బిల్ కలెక్టర్ గా సర్వీసును క్రమబద్దీకరించేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన భైరవమూర్తి 2019 లో హైకోర్టును ఆశ్రయించారు. ఆయన సర్వీసును క్రమబద్ధీకరించాలని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. అధికారులు అమలు చేయకపోవడంతో 2020 లో ఆయన కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ , తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి , జిల్లా పంచాయతీ అధికారి ( డీపీవో ) ఎస్.పి నాగేశ్వర్ నాయక్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు . అంతిమంగా 2021 మే 31కి అధికారులు కోర్టు ఆదేశాల్ని అమలు చేశారు . విచారణకు హాజరుకావాలని ఆదేశం వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాల అమలు చేయడంలో జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి ... ఏప్రిల్ 1 న అధికారులకు ఫాం -1 నోటీసులు జారీకి ఆదేశించారు . దీంతో జూన్ 18 న జరిగిన విచారణకు గోపాలకృష్ణ ద్వివేది , గిరిజా శంకర్ , నాగేశ్వర్ నాయక్ న్యాయస్థానం ముందు హాజరయ్యారు . కలెక్టర్ మురళీధర్‌రెడ్డి హాజరు కాకపోవడంపై ఆయన తరపు న్యాయవాది కారణాన్ని వివరించారు . ఫాం -1 నోటీసులో ' కోర్టు ఆదేశాలు అమలు చేసినట్లయితే కలెక్టర్ కోర్టు ముందు హాజరుకావాల్సిన అవసరంలేదు అని ఉందన్నారు . ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి .. అదనపు వాక్యాలు చేర్చిన వారెవరో గుర్తించాలని రిజిస్ట్రార్ ( జ్యూడీషియల్ ) ను ఆదేశించారు .
ఆ ఇద్దరు అధికారులు బాధ్యలుగా తేలడంతో వారిపై సుమోటో కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని ఆర్జీనీ న్యాయమూర్తి ఆదేశించారు . క్షమాపణలు కోరిన అధికారులు కోర్టు ఆదేశాల అమలులో జాప్యానికి పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది , డీపీవో ఎస్.వీ నాగేశ్వర్ నాయక్ బాధ్యులుగా న్యాయమూర్తి తేల్చారు . వారిద్దరు భేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు , భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని కోర్టుకు విన్నవించారు . వారి క్షమాపణలను అంగీకరించిన న్యాయమూర్తి .. భవిష్యత్తులో కోర్టు ఉత్తర్వుల అమలుపట్ల అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ప్రభుత్వ అధికారులపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని మూసేస్తూ ఉత్తర్వులిచ్చారు
ఇదీ చదవండి: krishna and godavari boards: కృష్ణా, గోదావరి బోర్డులకు విస్తృతాధికారాలు