ఎంపీలు, ఎమ్మెల్యేల విషయంలో దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లపై విచారణాధికార పరిధి.. సంబంధిత సెషన్స్ కోర్టులకు కాని అదనపు జిల్లా కోర్టులకు కాని ఉంటుందని హైకోర్టు పేర్కొంది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టుకు అప్పీళ్ల విచారణ పరిధి లేదని స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టుకు వచ్చిన అప్పీళ్లను సంబంధిత సెషన్స్ కోర్టుకు బదిలీ చేయాలని ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.లలిత ఈ మేరకు తీర్పు ఇచ్చారు.
2017 డిసెంబర్లో సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎంపీ, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటైంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేలపై రాష్ట్రంలో ఉన్న కేసులన్నీ ప్రత్యేక కోర్టుకు చేరాయి. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలపై 2008, 2011, 2014 లో నమోదైన కేసులను దిగువ కోర్టులు విచారణ చేసి తీర్పులు వెల్లడించాయి. వాటిపై పలు అప్పీళ్లు వేశారు. ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసులన్నీ ప్రత్యేక కోర్టుకు పంపాలని హైకోర్టు ఆదేశాలతో సెషన్స్ కోర్టులో ఉన్న అప్పీళ్లు విజయవాడలోని ప్రత్యేక కోర్టుకు బదిలీ అయ్యాయి. వీటి విచారణ పరిధిపై సందేహం వెలిబుచ్చుతూ విజయవాడలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కృష్ణాజిల్లా ప్రిన్సిపల్ జడ్జికి లేఖ రాశారు. ఆ లేఖను ఆయన హైకోర్టుకు నివేదించారు. ఈ వ్యవహారాన్ని రిఫరెన్స్ వ్యాజ్యాలుగా పరిగణించి హైకోర్టు విచారణకు తీసుకుంది.
ఇదీ చదవండి: Covid Vaccine: రాష్ట్రానికి చేరుకున్న మరో 6.60 లక్షల కొవిడ్ టీకా డోసులు