రాజధానికి సంబంధించి పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై సోమవారం హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత కుమార్ మిశ్ర, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తి , జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం హైబ్రిడ్ విధానంలో (భౌతిక, వీడియో కాన్ఫరెన్స్) విధానంలో విచారణ చేపట్టనుంది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై కొవిడ్, తదితర కారణాలతో విచారణ వాయిదాపడుతూ వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 23 న విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని బెంచ్ విచారణను నవంబర్ 15కు వాయిదా వేసింది . ఎలాంటి అంతరాయమూ లేకుండా రోజువారీ పద్ధతిలో వాదనలు కొనసాగేందుకు వీలుగా పిటిషనర్ల తరఫు న్యాయవాదులు షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
న్యాయవాదులు వ్యక్తిగత కారణాలతో వాయిదాలు ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రాజధాని వ్యాజ్యాలపై సోమవారం కొత్త సీజే నేతృత్వంలోని బెంచ్ విచారణ జరపనుంది.
ఇదీ చదవండి: TDP complaint to SEC: 'ప్రచారం నిర్వహిస్తున్న వాలంటీర్లపై చర్యలు తీసుకోవాలి'