ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా...రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్, తెదేపా అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్లు శుభాకాంక్షలు తెలిపారు. గురువును దైవంగా పూజించే సంప్రదాయం మనదని.... విద్య, వివేకం, విలువలు నేర్పి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ వందనం తెలియజేశారు.
ఉపాధ్యాయులు సమాజ వాస్తుశిల్పులు: బిశ్వభూషణ్
ఉపాధ్యాయులు సమాజానికి వాస్తు శిల్పులని, భారతావని నిర్మాణంలో వారి భూమిక ఎంచదగినదని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉపాధ్యాయుల సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు. దేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా, భారత రెండవ రాష్ట్రపతిగా డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. జీవితంలో ఉన్నత నైతిక విలువలకు కట్టుబడిన మహనీయుడని గవర్నర్ కొనియాడారు.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలి: చంద్రబాబు
బాధ్యతాయుత పౌరులుగా బాల బాలికలను తీర్చిదిద్ది, దేశభవిష్యత్తును తరగతి గదుల్లో నిర్ణయించే శక్తి ఉపాధ్యాయులకే ఉందని చంద్రబాబు అన్నారు. అందుకే గరువును గురుబ్రహ్మగా పోల్చి, దైవ సమానులుగా ప్రవచించారని కొనియాడారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
తెలుగుదేశం 5ఏళ్ళ పాలనలో 5వేల కోట్లతో పాఠశాలల్లో మౌలికవసతులను అభివృద్దిచేశామని, డిజిటల్, వర్ట్యువల్ క్లాస్ రూమ్ లు ఏర్పాటుచేసినట్లు స్పష్టం చేశారు. 2 డీఎస్సీలు నిర్వహించి 10వేల పైగా టీచర్ పోస్ట్ లు భర్తీచేశామని వెల్లడించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. డీఎస్సీ-2018 అభ్యర్థుల ఎంపిక పూర్తయి 9 నెలలు కావస్తున్నా 3 వేల 633 మందిని ఈ ప్రభుత్వం ఇంకా నిరీక్షణలోనే ఉంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం నాడు-నేడు అనే కార్యక్రమాన్ని ఒక ఫార్స్ గా మార్చడం శోచనీయమని విమర్శించారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోవడం ఆవేదన కలిగిస్తోందన్న చంద్రబాబు... కరోనా పరిస్థితుల్లో కుటుంబసభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని కోరారు. ఎంతో నిబద్దతతో తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయులందరికీ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచేలా ముందుజాగ్రత్తల గురించి విద్యార్ధులను, తద్వారా వాళ్ల తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలని చంద్రబాబు కోరారు.
భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లోనే...
దేశ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లో జరుగుతుందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. అలాంటి తరగతి గదులను విజ్ఞానం అందించడంతో పాటు క్రమశిక్షణ, విలువలు నేర్పే పవిత్రమైన ఆలయాలుగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ లోకేష్ గురుపూజా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా ప్రపంచదేశాలకు భారతదేశ సంస్కృతి, నాగరికతల గొప్పదనాన్ని చాటిచెప్పిన ఫిలాసఫర్, ఉపాధ్యాయుడని కొనియాడారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి లోకేష్ నివాళులర్పించారు.
ఇదీ చదవండి: నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!