పురపాలక, నగరపాలక సంస్థల్లో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం పురపాలకశాఖ మార్గదర్శకాలనిచ్చింది. పాలకవర్గ మొదటి సమావేశం నిర్వహించిన 60 రోజుల్లోగా కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని కమిషనర్లకు సూచించింది. నగరపాలక సంస్థలలో ఐదుగురు చొప్పున, పురపాలక, నగర పంచాయతీలలో ముగ్గురు చొప్పున సభ్యులను ఎన్నుకోవాలి. నగరపాలక సంస్థలో ఎన్నుకోవలసిన ఐదుగురిలో ఇద్దరు మైనారిటీలు, మరో ముగ్గురు పురపాలనపై అవగాహన కలిగిన మాజీ ప్రతినిధులు, విశ్రాంత అధికారులు, ఉద్యోగులై ఉండాలి.
పురపాలక, నగర పంచాయతీల్లోని ముగ్గురిలో ఇద్దరు మైనారిటీలు, మరొకరు పురపాలనపై అవగాహన కలిగినవారై ఉండాలని పురపాలకశాఖ పేర్కొంది. కోఆప్షన్ సభ్యుల స్థానాలకు దరఖాస్తు చేసుకునేవారు నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో ఓటరై 21 ఏళ్లకు తక్కువ కాకుండా ఉండాలి. దరఖాస్తు చేసిన వారిలో నుంచి కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం మేయర్, ఛైర్మన్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించాలి. నగరపాలక సంస్థల్లో కార్పొరేటర్లు, పురపాలక, నగర పంచాయతీల్లో కౌన్సిలర్లు చేతులెత్తి కోఆప్షన్ సభ్యులను ఎన్నుకునేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్లను పురపాలకశాఖ ఆదేశించింది.
ఇదీ చదవండి: