కొవిడ్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో సమావేశమైంది. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు కల్పన, హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషంట్ల బాగోగులు ఇతర అంశాలపై చర్చించారు. రుయా ఆసుపత్రి ఘటన దురదృష్టకరమని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టచర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ఆదేశించారన్నారు. ఆక్సిజన్‌ను సరఫరా చేసే పైప్ లైన్లను తరచూ పరిశీలించాలని.. ఏవైనా లోపాలుంటే తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు.
600 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేలా చర్యలు..
రాష్ట్రంలో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా.. రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం మరింత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 517 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వ చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ నిల్వ సామర్థ్యాన్ని 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో 49 మినీ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందని.. మంత్రుల సబ్ కమిటీ సమావేశంలోని అంశాలను మంత్రులు ఆళ్ల నాని, కురసాల కన్నబాబు మీడియాకు వివరించారు. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీరే అవకాశముందని ఆశాభావం వ్యక్తంచేశారు.
వాక్సినేషన్ కోసం ఎన్ని కోట్లయినా కేటాయిస్తాం..
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథా నివారణకు జిల్లా కేంద్రాల్లో మానిటరింగ్ సెల్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఈ సెల్ పర్యవేక్షణతో నెల్లూరు జిల్లాలో 4 నుంచి ఐదు 5 టన్నుల ఆక్సిజన్ ఆదా చేసినట్లు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేయాలని సీఎం నిర్ణయించారని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతూ, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని, ఇది సరికాదని ఆయన అన్నారు.
సరిహద్దుల్లో వాహనాలను ఆపడం లేదు..
రాష్ట్రంలో కొవిడ్ కేర్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని ఐదుగురు మంత్రుల సబ్ కమిటీ సిఫార్సు చేసిందని మంత్రి కన్నబాబు తెలిపారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 15 వేలకు పైగా బెడ్లు ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్రం నుంచి వచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవడం వల్ల కలిగే ఇబ్బందులపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించామన్నారు. ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల వద్ద రాష్ట్ర అంబులెన్స్‌లను అడ్డుకోవడం లేదన్నారు. కరోనా నివారణకు ఒళ్లంతా ఆవు పేడ పూసుకోవాలని, ముక్కులో ఉల్లి రసం వేసుకోవాలని సూచిస్తూ సామాజిక మాద్యమాల్లో వస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. శాస్త్రీయమైన, నిపుణులు సూచించే పరిష్కార మార్గాలనే పాటించాలని మంత్రి కోరారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సేవలు పొందాలని చెప్పారు.
రెమిడెసివర్ కొరత లేదు..
రెమిడెసివిర్ ఇంజక్షన్లను నల్లబజారుకు తరలిపోకుండా చూసేందుకు.. అక్రమాల నివారణకు ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కమిటీల పనితీరుపై మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నట్లు పేర్కొన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో బెడ్ల సంఖ్య పెంచుతున్నామని.. ఆ సెంటర్లలో కరోనా బాధితులకు పౌష్టికాహారం, అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు పారిశుద్ధ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న రోగులకు అవసరమైన కిట్లు అందజేస్తున్నామన్నమని మంత్రులు వెల్లడించారు.
ఇదీ చదవండి: