మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగినుల సేవలపై ‘గ్రీన్ క్వీన్స్ ఆఫ్ ఇండియా- నేషన్స్ ప్రైడ్’ పుస్తకం విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ప్రత్యేక ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సీఎస్ రామలక్ష్మి ఈ సర్వీసులోకి వచ్చిన విధానం, ఉద్యోగ జీవితంపై అందులో ఇలా ప్రస్తావించింది. ‘రామలక్ష్మి గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతంగా పనిచేశారు. ఐఎఫ్‌ఎస్ పరీక్షలకు సరదాగా దరఖాస్తు చేసుకున్నా ఉద్యోగ జీవితంలో విజయవంతంగా రాణించారు. ఐఎఫ్‌ఎస్ అధికారిగా గుంటూరులో తొలుత పని చేసినా.. తర్వాత ప్రస్తుత తెలంగాణలోని కరీంనగర్ ఈస్ట్ డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా తనదైన ముద్ర వేసుకున్నారు.
నక్సల్ ప్రభావం ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతంలో ఎలాంటి సదుపాయాలు లేకున్నా నెలలో 20 రోజులు రాత్రిపగలు విధులు నిర్వర్తించారు. ఆ సమయంలోనే అక్కడి పేదలకు ఇళ్ల నిర్మాణం, రేషన్ పంపిణీ, ఆదాయం కల్పించే పథకాలు అమలుచేసే అదనపు బాధ్యతలనూ చేపట్టారు. 1986లో గోదావరి నది ఆకస్మిక వరదలతో నష్టపోయిన వారికి సహాయ, పునరావాస కార్యక్రమాలు చేపట్టగా ఏపీ ప్రభుత్వం ఉత్తమ సేవా పథకంతో సత్కరించింది. పదవీ విరమణ తర్వాత కూడా రామలక్ష్మి క్రియాశీలకంగా ఉన్నారు.’ అని పుస్తకంలో వివరించారు.
తెలుగు క్వీన్స్ ఆఫ్ ఫారెస్ట్‌లు వీరే...
ఐఎఫ్‌ఎస్‌లోకి 1980 సంవత్సరంలో మహిళల ప్రవేశం మొదలైంది. ఇప్పటి వరకు 284 మహిళలు పని చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి 8, తెలంగాణ నుంచి 11 మంది మహిళలు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి సీఎస్ రామలక్ష్మి, ఎం.రేవతి, శాంతిప్రియ పాండే, జ్యోతి తుల్లిమెల్లి, యశోదా బాయ్, నందనీ సలారియా, సుమన్ బేనివాల్, నిషా కుమారి ఉన్నారు. తెలంగాణ నుంచి ఆర్.శోభ, సి.సువర్ణ, సునితా జేఎం భగవత్, అకోయ్‌జామ్ సోనిబాలా దేవి, ప్రియాంకా వర్గీష్, ఎస్‌జే ఆశా, ఎన్.క్షితిజ, శివానీ డోగ్రా, అర్పణా, భూక్యా లావణ్య, బోగా నిఖిత పేర్లను పుస్తకంలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: