గ్రామ, వార్డు సచివాలయ నియామకాలకు సంబంధించి ఈ రోజు నుంచి పరీక్షలు జరగనున్నాయి. పరీక్షల కోసం 10,56,931 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఖాళీగా ఉన్న 1025 కేటగిరీ 1పోస్టుల భర్తీకి ఇవాల ఉదయం 10గంటల నుంచి 12.30 వరకు పరీక్ష నిర్వహిస్తారు. పంచాయతీ సెక్రటరీ, మహిళా పోలీసు, వార్డు అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ, వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ పోస్టులకు ఉదయం పరీక్ష జరగనుంది.
మధ్యాహ్నం 2. 30 నుంచి 5 గంటల వరకు గ్రేడ్ -3 ఉద్యోగ నియామక పరీక్ష జరగనుంది. ఖాళీగా ఉన్న 1134 డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు మధ్యాహ్నం పరీక్ష జరగనుంది. పరీక్షలకు 6.81 లక్షల అభ్యర్థులు హాజరు కానున్నారు. ఉదయం పరీక్ష కోసం 2,221 కేంద్రాలు , మధ్యాహ్నం పరీక్షకు 1068 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పరీక్షకు 9. 15గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1.45గంటలకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 10 గంటలు, మధ్యాహ్నం 2.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలని సూచించారు.
కొవిడ్ దృష్ట్యా పరీక్షల నిర్వహణలో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. కొవిడ్ దృష్ట్యా 14 నుంచి 16 మంది అభ్యర్థులకు ఒక గది చొప్పున ఏర్పాటు చేశారు. కరోనా పాజిటివ్ వున్న అభ్యర్ధులకు ప్రత్యేక ఐసోలేషన రూంలు ఏర్పాటు చేశారు. పీపీఈ కిట్‌లతో ఐసోలేషన్ రూంలో ఇన్విజిలేషన్ ఏర్పాటు చేశారు. అభ్యర్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని నిబంధన అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్దకు ఆర్టీసీ రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసింది.
ఇదీ చదవండి: ముంబయిపై ప్రతీకారం.. తొలి మ్యాచ్ చెన్నైదే