ACCIDENT: సత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
VICE PRESIDENT: శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదంపై ఉపరాష్ట్రపతి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కూలీలు మృత్యువాత పడిన ఘటన అత్యంత విచారకరమని..గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.
GOVERNOR: శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన ప్రమాదం పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు మహిళా కూలీలు మృతిచెందడం బాధాకరమన్నారు. ప్రమాద వివరాలు తెలుసుకోవాలని రాజ్‌భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాకు గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.
CM JAGAN: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పారిస్‌లో ఉన్న సీఎంకు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ప్రమాద వివరాలు తెలిపారు.
CHANDRABAU: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందని ఆవేదన చెందారు. నిర్లక్ష్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి ప్రభుత్వానికి సూచించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
PAWAN KALYAN: శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి దగ్గర విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి ఐదుగురు మహిళా కూలీలు సజీవ దహనం అయిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో చోటు చేసుకున్న హృదయ విదారకమైన ఈ విషాదం మనసుని కలచి వేసిందని తెలిపారు. ఆ కుటుంబాలకు నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటాం.. మరి వాతావరణం సాధారణంగా ఉన్న రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా ? అనే విషయాన్ని ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసి ఉందని అన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను.. విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలని ప్రభుత్వానికి సూచించారు.
LOKESH: శ్రీసత్యసాయి జిల్లాలో ప్రమాదంపై లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలని కోరారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన పరిహారం చెల్లించాలన్నారు.
సత్యసాయి జిల్లా ప్రమాద ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరినాథరావు స్పందనను నారా లోకేశ్ తప్పుబట్టారు. ప్రమాదానికి ఉడత కారణమని సీఎండీ ఎలా అంటారని ప్రశ్నించారు. తేనెటీగల వల్ల రథం తగలబడటం జగన్ పాలనలోనే జరుగుతాయని విమర్శించారు. కుక్కలు తరిమితే భయపడి కోర్టులో కాకాని కేసు ఆధారాలు ఎత్తుకుపోయాయా.. ఉడత వల్ల హైటెన్షన్ వైర్ తెగడం వంటివన్నీ జగన్ నాటక రెడ్డి పాలనలోనే జరుగుతాయని ఎద్దేవా చేశారు. ఇంకా నయం! కోతల్లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని చెప్పలేదని మండిపడ్డారు. ఐదుగురు నిరుపేదలు సజీవ దహనమైతే, కనీస విచారణ జరపకుండానే అధికారులతో కట్టుకథల కహానీలు చెప్పించడం వైసీపీ సర్కారుకి అలవాటైపోయిందని దుయ్యబట్టారు.
APSPDCL MD: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు స్పష్టం చేశారు. క్షతగాత్రులకు రూ.2 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రమాదంపై విజిలెన్స్ విచారణ చేస్తామని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలియజేశారు.
ఇదీ జరిగింది: తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు బయలుదేరారు. ఆటోలో ప్రయాణిస్తున్న వీరు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపానికి చేరుకోగానే.. విద్యుత్ తీగలు తెగి ఆటోమీద పడ్డాయి. క్షణాల్లోనే మంటలు ఆటో మొత్తాన్నీ చుట్టు ముట్టాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యే లోపే.. లోపల ఉన్న కూలీలకూ మంటలు అంటుకున్నాయి. హాహాకారాలు.. ఆర్తనాదాలతో ప్రాణాలు దక్కించుకునేందుకు అందరూ ప్రయత్నించారు. కానీ.. కొందరికి దుస్సాధ్యంగా మారింది. ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్్తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు.
ఇవీ చదవండి: