2022 జనవరి 3వ తేదీ నుంచి 15 - 18 ఏళ్ల లోపున్న వారికి కొవిడ్ టీకా అందించే అంశంపై... రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కేంద్రం సూచించిన అంశాల ఆధారంగా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ వయస్సుల వారికి కేవలం కొవాగ్జిన్ మాత్రమే అందుబాటులో ఉందని తెలిపింది. వీరితో పాటు 60 ఏళ్లు పైబడిన వారు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకూ జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ వేయనున్నట్లు వివరించింది.
వారికి మూడో డోస్ వ్యాక్సిన్...
2007 లేదా అంతకంటే ముందు పుట్టిన వారంతా... ఈ వ్యాక్సిన్ డోసుకు అర్హులని, వీరందరూ కొవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. టీకా వేసే వైద్యారోగ్య కేంద్రాల్లోనూ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వివరించింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా... ఇప్పటికే రెండు డోసులు తీసుకున్న ఆరోగ్యకార్యకర్తలు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు 2022 జనవరి 10 నుంచి మరో డోసు వ్యాక్సిన్ ఇస్తామని వివరించింది. రెండో డోసు తీసుకుని, 9 నెలలు దాటితేనే బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులని వెల్లడించింది. ఇప్పటికే 2 డోసులు తీసుకున్న 60 ఏళ్ల వయసు దాటిన వ్యక్తులకూ ఇదే తరహాలో మరో డోసు వ్యాక్సిన్ ను జనవరి 10 నుంచి అందించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
సర్క్యులర్ జారీ...
టీకా రెండో డోసు తీసుకుని 39 వారాలు లేదా 9 నెలలు దాటితేనే బూస్టర్ డోస్ వేసుకునేందుకు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఈ మార్గదర్శకాలన్నీ 2022 జనవరి 3 నుంచి అమలులోకి వస్తాయని వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.
ఇదీ చదవండి: Car Crashed Into Pond: వంకలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి