ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆసుపత్రులను నిర్మించాలన్న ప్రభుత్వ టెండరు ప్రకటనపై ఒక్క కర్నూలు జిల్లాకు మినహా... మిగిలిన జిల్లాలకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. దీంతో గతంలో పిలిచిన టెండరు ప్రకటనను రద్దు చేసి.. మరోసారి ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది. కర్నూలులో ఆసుపత్రి నిర్మాణానికి అంకిత ఆసుపత్రి యాజమాన్యంతోపాటు మరో వ్యక్తి బిడ్ దాఖలు చేశారు. కనీసం వంద పడకలు.. రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టే వారికే బిడ్ దాఖలుకు అవకాశం కల్పించారు. అంతకుమించి ప్రతిపాదించే పడకల సంఖ్య, ఆసుపత్రి నిర్మాణానికి పెట్టే పెట్టుబడి, సూపర్ స్పెషాలిటీ (ఉన్నత స్థాయి వైద్యం) సేవల ఆధారంగా మార్కులను కమిటీ కేటాయిస్తుంది. అందులో ఎక్కువ మార్కులు సాధించిన సంస్థకు ఆసుపత్రి నిర్మాణానికి అవకాశం కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కనీసం ఒక కార్పొరేట్ ఆసుపత్రిని నిర్మించాలని, దీనికి ఏపీఐఐసీ ద్వారా భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గత ఏడాది నవంబరులో ఏపీఐఐసీ టెండరు ప్రకటన జారీ చేసింది. నిర్మాణం పూర్తయిన తర్వాత అందులో 50% పడకలను ఆరోగ్యశ్రీకి కేటాయించాలి. ప్రీబిడ్ సమావేశంలో వర్చువల్ విధానంలో నిర్వహించిన సంప్రదింపులకు 15-20 కార్పొరేట్ ఆసుపత్రుల తరఫున ప్రతినిధులు పాల్గొన్నారు. టెండరు ప్రకటనకు ఆసుపత్రుల యాజమాన్యాల నుంచి ఆశించిన స్పందన లేకపోవటంతో కమిటీ రెండు రోజుల కిందట మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో సమావేశమై చర్చించింది. టెండరు నిబంధనల్లో కొన్ని మార్పులను కమిటీ సూచిస్తూ నివేదికను ప్రభుత్వ పరిశీలనకు పంపింది.
ఇదీ చదవండి:POLAVARAM DAM : పోలవరం ప్రాజెక్టు...నిర్మాణం పూర్తయ్యేదెన్నడు...?