Godavari flood: తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం 35 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం... ఇవాళ 41. 2 అడుగులు దాటింది. నిన్న సాయంత్రం నుంచి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఇవాళ ఉదయానికి 38 అడుగుల వద్దకు చేరగా మధ్యాహ్నానికి 41.2 అడుగులు దాటి ప్రవహిస్తోంది.
భద్రాచలం వద్ద గోదావరిలోకి ఎగువ నుంచి 8,56,949 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది అధికారులు తెలిపారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో... స్నానఘట్టాల వద్దకు నీరు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలంలో ఇంకా నీటిమట్టం పెరుగుతుంది. కాసేపటి క్రితం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరో రెండ్రోజులు భారీ వర్షాలు ఉన్నందున గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీడబ్ల్యూసీ అధికారులు సూచించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇప్పటికే భద్రాచలం అతలాకుతమైంది. గత నెలలో వచ్చిన వరదలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది. మరోసారి వరదలు వస్తే మరింత నష్టపోయే అవకాశముంది.
ఇటీవల వరదలతో అల్లాడిన భద్రాచలం : ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో వెల్లువెత్తిన గోదారమ్మ.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. భద్రాచలం, మణుగూరు, బూర్గంపాడు పట్టణాలు సహా 89 పల్లెలు జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. సారపాక, నాగినేనిప్రోలు, రెడ్డిపాలెంతో పాటు విలీన మండలాలైన కూనవరం, వేలేరుపాడులో వందలాది గ్రామాలు ముంపు బారినపడ్డారు. బాధితులను రక్షించేందుకు సింగరేణి రెస్క్యూ బృందంతో పాటు.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆయా గ్రామాల పరిధిలో వరదలో చిక్కుకున్న 10 వేల మంది బాధితులను రక్షించే పనిలో పడ్డారు. సారపాక ఐటీసీ కాగిత కర్మాగారంలోకి వరద నీరు చేరడంతో యాజమాన్యం ప్లాంటును తాత్కాలికంగా మూసివేశారు.
భద్రాచలం వద్ద 70 అడుగులకు పైన నీటిమట్టం దాటి ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల జనం భయం గుప్పిట్లో కాలం వెళ్లదీశారు. 1986 నాటి వరదలను మించి వస్తాయనే భయంతో జంకుతున్నారు. ఇప్పటికే చాలా మంది వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. సురక్షిత ప్రాంతాలకు వచ్చేందుకు కొంతమంది మొరాయిస్తున్నప్పటికీ మంత్రి పువ్వాడ, కలెక్టర్ అనుదీప్ ఆయా ప్రాంతాల్లో పర్యటించి.. అవగాహన కల్పించారు. ప్రాణనష్టం జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టారు. పలుచోట్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారమూ అందటం లేదని.. బాధితులు వాపోయారు.
ఇవీ చదవండి: