GRMB Meeting: హైదరాబాద్ జలసౌధలో 13వ గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్లు ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ తెలిపారు. తెలంగాణ చేపట్టిన మూడు ప్రాజెక్టులపై చర్చించినట్లు పేర్కొన్నారు. ఆ మూడు ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవని, గోదావరిలో నీటి లభ్యతపై అధ్యయనం చేయాలని కోరామన్నారు. ఎవరికెంత కేటాయింపులనేది తేల్చాలని కోరామన్నారు. గోదావరిపై ట్రైబ్యునల్ వేయాలని, గోదావరిలో నీటి లభ్యతపై కేంద్రం అధ్యయనం చేయాలని కోరామన్నారు. శ్రీశైలం, సాగర్ భద్రతలై పాండ్య కమిటీ రిపోర్టు ఇచ్చిందని శశిభూషణ్ పేర్కొన్నారు.
తెలంగాణ వాదన ఇది...
గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు డైవర్ట్ చేస్తుందని... అందులో భాగంగా తెలంగాణకు 45 టీఎంసీ వాటా రావాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. అలాగే సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించినట్లు స్పష్టం చేశారు.
తెలంగాణకు చెందిన చనాకా- కొరాటా ఆనకట్ట, చౌటుపల్లి హన్మంతురెడ్డి, చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకాల డీపీఆర్లపై, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెంకటనగరం పంప్‌హౌస్, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల డీపీఆర్లపై కూడా చర్చించినట్లు రజత్‌కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు. సీడబ్ల్యూసీకి తాము నివేదక పంపించినట్లు వెల్లడించారు.
సమావేశంలో ఏపీ నుంచి పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని రజత్ కుమార్ పేర్కొన్నారు. కాగా ఏపీ అభ్యంతరాలును జీఆర్‌ఎంబీ ఛైర్మన్ తిరస్కరించినట్లు చెప్పారు. గెజిట్ నోటిఫికేషన్‌పై సబ్ కమిటీ ద్వారా వివరాలు అధ్యయనం చేసి నివేదిక ఇస్తారన్నారు. బోర్ఢు ఛైర్మన్ ఎంపీ సింగ్ అన్ని అంశాలను నోట్ చేసుకున్నారని వివరించారు. ఈఎన్సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ దేశ్‌పాండే.. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.
"మన ప్రాజెక్టులకు సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయి. ఇవాళ కూడా ఏపీ నుంచి అభ్యంతరం పెట్టారు. ఏపీ అభ్యంతరాలను జీఆర్‌ఎంబీ ఛైర్మన్ తిరస్కరించారు. గెజిట్ నోటిఫికేషన్‌ను అధ్యయనం చేసి నివేదిక ఇస్తారు. గోదావరి నీటిని ఏపీ పట్టిసీమ ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లిస్తోంది. గోదావరి జలాల్లో తెలంగాణకు 45 టీఎంసీల వాటా రావాలి. సీలేరు ప్రాజెక్టులో తెలంగాణ వాటాపై కూడా చర్చించాం." -రజత్‌కుమార్, తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: ACHARYA TEAM: దుర్గమ్మను దర్శించుకున్న "ఆచార్య" చిత్ర బృందం..
CM Jagan review: రుయా తరహా ఘటనలు పునరావృతం కావొద్దు:సీఎం జగన్