భాగ్యనగర మేయర్, ఉప మేయర్ ఎన్నిక ప్రక్రియలో తాజాగా ఎక్స్‌అఫిషియోల లెక్క తేలింది. తెరాసకు అత్యధికంగా 32 మంది సభ్యులుండగా కార్పొరేటర్లతో కలిపితే బలం 88 మందికి పెరిగింది. అన్ని పార్టీల ఎక్స్‌అఫిషియోలు, కార్పొరేటర్లతో కలిపితే మేయర్ ఎన్నిక రోజున సమావేశానికి గరిష్ఠంగా 193 మంది హాజరవనున్నారు. వారందరికీ ఎన్నికకు సంబంధించి నోటీసులను పంపించే కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే ప్రారంభించారు. ఈ ప్రక్రియను ఫిబ్రవరి 6లోపు పూర్తి చేయనున్నారు.
ప్రభుత్వానికి వివరాలు..
పురపాలకశాఖ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎక్స్‌అఫిషియోల వివరాలు జీహెచ్‌ఎంసీకి వచ్చాయి. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ రాంచంద్రారెడ్డి, ఎంపీ రేవంత్‌రెడ్డి తదితరులు ఇప్పటికే ఓటుహక్కు వినియోగించుకున్నట్లు తేలింది. దాంతో 52గా ఉంటుందనుకున్న ఎక్స్‌అఫిషియోల సంఖ్య 44కు తగ్గింది. ఆమోదించిన ఎక్స్‌అఫిషియో సభ్యుల వివరాలను జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ ఇప్పటికే హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమహంతి, రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేశారు.
అన్నీ ఊహాగానాలే..
గ్రేటర్‌లో అధికార తెరాస పార్టీ 88 మంది సభ్యుల బలంతో పెద్ద పార్టీగా అవతరించింది. మేయర్ ఎన్నికతో పాలకమండలి ఏర్పాటవుతుంది. చట్ట ప్రకారం మేయర్ ఎన్నిక జరగాలంటే మొత్తం సభ్యుల్లో సగం మంది (కోరం) సమావేశానికి హాజరవ్వాలి. అంటే 97 మంది సభ్యులుండాలి. లేకుంటే సమావేశాన్ని మరుసటి రోజున లేదా మరో తేదీన నిర్వహించాలి. రెండో సమావేశానికీ కోరం లేకపోతే మూడో సమావేశానికి తేదీ నిర్ణయిస్తారు. ఆరోజు కోరంతో పని లేకుండా ఎన్నిక నిర్వహిస్తారు.