scholarships: ప్రభుత్వ సాయంతో తమ పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకుంటారంటే తల్లిదండ్రులు పొంగిపోయారు. తీరా అక్కడికి వెళ్లాక ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో అటు విదేశాల్లోని విద్యార్థులతో పాటు ఇక్కడ తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదంటూ ఆందోళన చెందుతున్నారు.
విదేశాల్లో పేద, మధ్యతరగతి పిల్లలు ఉన్నతవిద్యను సముపార్జించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 350 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా కార్పోరేషన్ల నుంచి అనుమతులు పొంది విదేశాల్లో ఎం.బీ.బీ.ఎస్ ,ఎమ్.ఎస్ వంటి కోర్సుల్లో ప్రవేశానికి విదేశాలు వెళ్లారు. ఫిలిఫ్పీన్స్, అమెరికా, చైనా, ఉక్రెయిన్, కజకిస్థాన్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలకు విద్యార్థులు తరలివెళ్లారు. ఒక్కో కోర్సుకు ఒక్కోవిధంగా ఉపకార వేతనాలను ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అందాల్సి ఉంది. ఉదాహరణకు MBBS విద్యార్థులకు ఏడాదికి 3 లక్షల రూపాయల చొప్పున 15 లక్షలు అందించాల్సి ఉంటుంది. ఈ ఉపకార వేతనాలతోనే అక్కడి ఫీజులు, వసతి సదుపాయాలను సమకూర్చుకోవాలి. కానీ 2019 నుంచి ఇప్పటివరకు పైసా ఉపకార వేతనం అందకపోవడంతో ఏమి చేయాలో అర్థం కాక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు, అధికారుల చుట్టూ పలుమార్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో నిరసన బాటపట్టారు. ప్రభుత్వం కరుణించాలని గుంటూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. గుంటూరు జిల్లాతో పాటు విశాఖపట్నం, కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, హిందూపురం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు.
రెండేళ్లుగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకం అందకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కొందరు అప్పులు తెచ్చి వాటికి వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్ దెబ్బకు కొందరు ఆర్థికంగా కుదేలయ్యారు. విదేశాల నుంచి పిల్లలు ఫీజులు, వసతి కోసం తాము పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టడంతో ఇక్కడ తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలనీ విదేశీ ఉన్నతవిద్యకు ఉపకార వేతనాలు మంజూరు చేయాలని విద్యార్థులు, తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: Asha Workers: చదువు అవసరం లేదని చెప్పి, ఇప్పుడు పరీక్షలు పెడితే ఎలా? ఆశా కార్యకర్తల ఆవేదన