పరీక్షల సమయం.. వచ్చేస్తుంది. తిండి, నిద్ర సంగతి పట్టించుకోకుండా చదువుపై దృష్టి సారిస్తుంటారు చాలా మంది విద్యార్థులు. ఎండల తీవ్రత కారణంగా త్వరగా అలసిపోతారు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల ఆహారంపై కాస్త శ్రద్ధ చూపాలి. ఉష్ణోగ్రతలు పెరిగే సమయంలో శరీరంలో నీరు తగ్గకుండా జాగ్రత్తగా ఉండాలి. కంటిపై ఒత్తిడి పడకుండా కొద్ది సమయం విశ్రాంతినిస్తూ.. చల్లటి నీళ్లతో శుభ్రపరచుకోవాలి.
ఇలా చేస్తే.. మేలు!
- ఉదయం 7 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే మెదడు చురుగ్గా ఉంటుంది.
- రాత్రి సమయంలో ముందుగానే తేలికపాటి ఆహారం తీసుకోవాలి.
- రోజూ గుడ్డు తీసుకుంటే ప్రోటీన్ తగినంత లభిస్తుంది.
- మాంసాహారం తీసుకునేవారు మసాలా తగ్గించి తినాలి.
- ప్రతి 2 గంటలకోసారి గ్లాసు నీరు, ప్రతి 3 గంటలకోసారి శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకోవాలి.
- జ్ఞాపకశక్తికి బాదం, పిస్తా, వాల్‌నట్స్ మంచివి.
- డీహైడ్రేషన్ బారినపడకుండా పండ్ల రసాలు, కొబ్బరిబొండాలు, మజ్జిగ, సబ్జా గింజలు మంచివి.
- పుచ్చకాయ, కర్బూజ, ద్రాక్ష, ఆరెంజ్ వంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి.
- సాయంత్రం మొలకెత్తిన గింజలు, శనగలు, బొబ్బర్లు వంటి పీచు పదార్థాలు తినాలి.
- బిస్కెట్లు, కాఫీ, టీ, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి.
విద్యార్థులు చేసే తప్పిదాలు
- పరీక్షల వేళ పిల్లలు ఆహారం సరిగా తీసుకోరు
- ఒత్తిడితో డీహైడ్రేషన్ బారినపడేవారి సంఖ్య పెరుగుతుంది.
- శక్తినిచ్చే సప్లిమెంట్స్‌ను తీసుకుంటుంటారు.వీటితో ఇబ్బందులు వస్తాయి.
- బయటి ఆహారపదార్థాలు, మసాలాలు తింటే కడుపులో అవస్థే.
- సమయానికి సరిగా తినకపోవడం వల్ల మెదడు పనితీరు నెమ్మదిస్తుంది.
- ఒత్తిడి, అలసట, పోషకాలు తగ్గడం వల్ల పరీక్ష హాలులో కళ్లు తిరిగి పడిపోతుంటారు. నిద్ర మత్తును దూరం చేసేందుకు కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటారు.
ఇదీ చదవండి : వాయిదా జపం వద్దు.. ఇవాళే మొదలు పెట్టండి