వరద తగ్గుముఖం పట్టింది. కృష్ణమ్మ శాంతించింది. మొన్నటి వరకు అద్దంలా మెరిసిన ఇళ్లు ఇప్పుడు చిందరవందరైపోయాయి. నిండా బురద, ప్లాస్టిక్ సీసాలు, బొద్దింకలు, విషపురుగులు.. ఏది కదిలిస్తే ఏం బయటపడుతుందో తెలియని దుస్థితిలో ఉన్నారు.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు. ఇప్పుడిప్పుడే ఇళ్లకు చేరుకుంటున్న బాధితులు.. కకావికలమైన తమ ఇళ్ల పరిసరాలు చూసి కన్నీటిన పర్యంతమవుతున్నారు.
వరదతోపాటు నదిలో కొట్టుకొచ్చిన చెత్తాచెదారాన్ని బాధితులు తొలగిస్తున్నారు. ఇంట్లో సామగ్రిని శుభ్రం చేసుకుంటున్నారు. రామలింగేశ్వర నగర్ మొదలు కృష్ణలంక తదితర ప్రాంతాల్లో బడుగుజీవులను కదిలిస్తే కన్నీళ్లే సమాధానమవుతోంది. కృష్ణా నది వరద బాధితులకు ట్రాన్స్‌జెండర్లు పెద్ద దిక్కుగా నిలిచారు. తమవంతు సాయంగా భోజనాలు అందిస్తున్నారు. ఎగువప్రాంతాల నుంచి వచ్చిన వరద కృష్ణా తీరం వెంబడి అనేక కాలనీవాసుల జీవితాలను తారుమారు చేసింది. భవిష్యత్‌లో ఇలాంటి కష్టనష్టాల్లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకుటున్నారీ బాధితులు.