తమిళనాడు రాష్ట్రం చెన్నై సమీపంలో సముద్ర జలాల్లో వేట సాగిస్తూ ఈ నెల 16న గల్లంతైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన 8 మంది వలస మత్స్యకారులు ఎట్టకేలకు తీరానికి చేరుకున్నారు. వీరి ఆచూకీ తెలిసినా ఇంతవరకు ఒడ్డుకు చేరకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన, ఉత్కంఠ రేగుతూనే ఉంది. చివరికి శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ప్రత్యేక బోటులో వీరంతా చెన్నైకి చేరుకున్నారు. రెండు రాష్ట్రాల్లో కలవరం రేపిన ఈ ఘటన అసలు ఎలా జరిగింది. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన నాలుగు రోజులు ఎలా ఉన్నారు. ప్రాణాలను ఎలా కాపాడుకున్నారో వివరించారు. నడిసంద్రంలో బతుకు వేట ఎలా సాగిందో వారి మాటల్లోనే.
నడిసంద్రంలో ప్రశాంతంగా వేట సాగిస్తున్నాం. ఈనెల 16వ తేదీ ఉదయం డ్రైవరు వచ్చి బోటు కదల్లేదని చెప్పేసరికి ఆందోళనకు గురయ్యాం. వెళ్లి పరిశీలించగా కీలకమైన పంకా తెగిపోయి కనిపించింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఇక ప్రయాణం సాగించలేమని తెలిసింది. అప్పటికే అండమాన్-చెన్నై మధ్య భాగంలో ఉన్నాం. కదల్లేని స్థితిలో ఉన్న బోటులోకి సముద్ర జలాలు వస్తున్నాయి.
ఈ విషయం చెన్నై తీరంలో ఉన్న యజమానికి చెప్పేలోగా వైర్‌లెస్ సెట్ కూడా పనిచేయడం మానేసింది.. అంతే నడిసంద్రంలో ప్రాణాలు నిలిచే పరిస్థితి కష్టమని భావించాం. గాలివాటుకు ఎటువైపు వెళ్తుందో తెలియడం లేదు. నీటిని బయటకు తోడుతూ భయాందోళనల మధ్య 15 గంటలు నరకయాతన అనుభవించాం.. ఏం చేయాలో పాలుపోలేదు. ఎవరికీ సమాచారం ఇచ్చేందుకు అవకాశం లేదు.. ఒకరిద్దరు వైర్‌లెస్ సెట్‌తో కుస్తీలు పడుతూనే ఉన్నారు. ఎందుకంటే సమీపంలో వేట సాగించే వారికి సమాచారం వెళ్లే అవకాశం ఉంటుందని.
15 గంటల తర్వాత పది నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న మరో బోటుకు వైర్‌లెస్ ద్వారా సమాచారం వెళ్లింది. వారు వెంటనే స్పందించారు. తాము వస్తున్నామని ఆందోళన చెందొద్దంటూ ఓదార్పునిచ్చారు. గంట సమయం తర్వాత వారు కనిపించడంతో ప్రాణాలు లేచి వచ్చినట్లయింది. వారంతా వేట సంగతి పక్కన పెట్టి మా వలను తీసేందుకు ఒక పూటంతా కష్టపడ్డారు. మూడు రోజులు మాతోనే ఉన్నారు. ఈ లోగా మా యజమాని మరో పడవ పంపడంతో అందులో ఎక్కి చేరుకున్నాం. రెండో రోజున నావికాదళ విమానం వచ్చి పరిస్థితిని గమనించి చిత్రాలు తీసింది.
అనంతరం నావికాదళ సిబ్బంది వచ్చారు. మా వెంటే రెండు రోజులు ప్రయాణం సాగించి మా అవసరాలు తీర్చారు. తీరానికి చేరేవరకు మాతోనే ఉండటంతో ప్రాణాలతో ఒడ్డుకు చేరుతామనే ధైర్యం వచ్చింది.. ఆ రోజు వైర్‌లెస్ సెట్ పనిచేయకపోయినా. దగ్గరలో ఎవరూ లేకపోయినా మా ప్రాణాలు సముద్రంలో కలిసేవే. మమ్మల్ని తీరానికి చేరేందుకు సహకరించిన అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాం. ప్రభుత్వ అధికారులు కూడా మంచి సహకారం అందించారు.
ఇదీ చదవండి: