Farmers facing problems: ఖరీఫ్ పంటల్లో ఒక్కటీ సరిగా చేతికొచ్చే పరిస్థితి లేదు. ఎకరాకు రూ.లక్ష పెట్టుబడిగా పెట్టి మిరప సాగు చేస్తే.. తామర పురుగుతో ఎకరాకు 2, 3 క్వింటాళ్లు దిగుబడి రావడమూ గగనమైంది. గులాబీ పురుగు ధాటికి పత్తిలో ఎకరాకు రూ.15 వేలకు పైగా నష్టం వస్తోంది. వేరుసెనగ వేస్తే.. పశువుల మేతకూ మిగల్లేదు. కంది అయినా బాగుంటుందనుకుంటే.. వెర్రితెగులు ఆశించి కాయ కనిపించడం లేదు. వరిలో ఎకరాకు 30 బస్తాల పైన వస్తాయనుకుంటే 15 నుంచి 20 బస్తాల దిగుబడీ కనాకష్టమవుతోంది. ఇందులోనూ ఎకరానికి సగటున రూ.15 వేలకు పైనే నష్టం.. ఖరీఫ్‌లో భారీవర్షాలు, వరదలకు తోడు తెగుళ్లు, పురుగుతాకిడితో ప్రధాన పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఒక పంట దెబ్బతింటే మరోదానిలో గట్టెక్కొచ్చనే ఆశలూ పోయి రైతులకు రూ.లక్షల్లో అప్పులు మిగిలాయి. ఖరీఫ్‌లో వరి, వేరుసెనగ, మిరప, పత్తి, కందితోపాటు మినుము, మొక్కజొన్న తదితర పంటల సాగులో సుమారుగా రూ.16 వేల కోట్ల పెట్టుబడిని కోల్పోతున్నారు. ఉత్పత్తి నష్టం రూ.20 వేల కోట్ల పైనే ఉంటోంది. ఖరీఫ్‌లో వేసిన మినుము, పెసరతోపాటు మొక్కజొన్న సాగులోనూ నష్టాలు తప్పలేదు. రబీలో వేసిన సెనగనూ నల్లతామర పురుగు ఆశించింది.
పొగాకుకు పేనుబంక వచ్చింది. ఒకే సీజన్‌లో పంటలన్నీ పోవడం మునుపెన్నడూ చూడలేదని.. దీన్ని విపత్తు అనాలా? ఉత్పాతం అనాలా? మా కర్మ ఇంతే అని సరిపెట్టుకోవాలా? అని రైతులు వాపోతున్నారు. దాదాపు పూర్తిస్థాయిలో పెట్టుబడి పెట్టాక.. పంట చేతికొచ్చే దశలో విపత్తులు విరుచుకుపడ్డాయి. తెగుళ్లు విజృంభించాయి. పురుగుల తాకిడి పెరిగింది. దీంతో అధికశాతం రైతులు పెట్టుబడి మొత్తం నష్టపోయారు. ఎవర్ని కదిల్చినా లక్షల్లో అప్పులపాలయ్యామనే ఆవేదనే వినిపిస్తోంది
85 శాతం పైగా చిన్న, సన్నకారు రైతులే..
సాగుదారుల్లో 85% పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. వడ్డీ వ్యాపారుల దగ్గర, బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి పంటలపై పెట్టారు. కౌలురైతులుగా మారిన వ్యవసాయ కూలీలూ.. పనులకు వెళ్లి సంపాదించుకున్న మొత్తాన్నీ పెట్టుబడిగా పెట్టారు. కౌలు కూడా ముందే చెల్లించారు. ఇప్పుడు రూపాయి చేతికొచ్చే పరిస్థితి లేదని, అప్పులు ఎలా తీర్చాలని కుంగిపోతున్నారు.
గులాబీ ‘కత్తి’
తొలకరి ప్రారంభంలోనే పత్తి క్వింటాలు రూ.7వేలకు పైగా చేరింది. అయినా గతేడాది భారీ వర్షాలతో కొందరు రైతులు ఎకరాకు రూ.15 వేల వరకు నష్టపోవడం, గులాబీ పురుగు తాకిడి గుర్తొచ్చి.. 2 లక్షల ఎకరాల సాగు తగ్గించారు. తొలితీత పత్తినే క్వింటాలు రూ.7 వేల వరకు అమ్మారు. అక్టోబరు నెలాఖరు వరకు అంతా బాగుంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్లు వస్తుందని ఆశించారు. ఇంతలోనే భారీ వర్షాలతో కాపు రాలిపోయింది. కాయలు చెట్టుకే కుళ్లిపోయాయి. అయినా మరో కాపు వస్తుందని భావిస్తుండగా గులాబీ పురుగు విజృంభించి, వచ్చేదంతా పుచ్చుపత్తి అయింది. దిగుబడి ఎకరాకు 2 నుంచి 3 క్వింటాళ్లు దాటలేదు. పెట్టుబడులు కూడా తిరిగిరాని పరిస్థితి తలెత్తింది.
* పంట: పత్తి
* సాగు విస్తీర్ణం: 13,04,557 ఎకరాలు
* దిగుబడి దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: 80%
* ఎకరాకు సగటు దిగుబడి: 10 క్వింటాళ్లు
* ప్రస్తుతం వస్తున్నది: 2-3 క్వింటాళ్లే
* పెట్టుబడి నష్టం: రూ.1,662 కోట్లు అంచనా (మొత్తం పెట్టుబడి ఎకరాకు రూ.30వేలు, నష్టం.. రూ.15,000)
పొలం అమ్మేశా.. ఇప్పుడు మళ్లీ అప్పులయ్యాయి
నాకు తెలిసిన విద్య వ్యవసాయమే అంటున్న ఈ రైతు పేరు కరీముల్లా.. గుంటూరు జిల్లా పుల్లడిగుంటకు చెందిన ఈయన రెండేళ్ల కిందటే వ్యవసాయంలో అప్పులు తీర్చడానికి ఉన్న ఎకరా పొలాన్ని అమ్మేశారు. ఇల్లొక్కటే మిగిలింది. ఈ ఏడాది ఎకరా రూ.40 వేల చొప్పున ఏడెకరాలు కౌలుకు తీసుకుని మిరప, ఎకరా రూ.25 వేల చొప్పున అయిదెకరాలు కౌలుకు తీసుకుని పత్తి వేశారు. మొత్తంగా రూ.10 లక్షల పెట్టుబడి అయింది. ఎకరానికి పది క్వింటాళ్లు వస్తుందనుకున్న పత్తి.. వానలు, గులాబీ పురుగుతో రెండు క్వింటాళ్లకు పడిపోయింది. నల్లతామర దెబ్బకు మిరపలో ఎకరాకు మూడు, నాలుగు క్వింటాళ్లూ కష్టమే. ‘బంగారం పెట్టి కొంత, నూటికి నెలకు రూ.2.50, రూ.2, రూ.1.50 వడ్డీకి మరికొంత అప్పు తెచ్చి పెట్టాం. వాటిని ఎలా తీర్చాలో అర్థం కావట్లేదు’ అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.
పశువుల మేతకైనా మిగల్లేదు..
ఎకరా వేరుసెనగకు రూ.35 వేల పెట్టుబడి పెడితే.. కిలో కాయ కూడా రాని రైతులు వేలాది మంది ఉన్నారు. వేరుసెనగ కాయ కోశాక మిగిలిన కట్టెను పశువుల మేతగా వేస్తారు. భారీవర్షాలతో కట్టె నల్లగా మారి.. మేతకూ పనికిరాలేదు. పంటకోత ప్రయోగాల లెక్కల ఆధారంగా చూస్తే.. అనంతపురం జిల్లాలో ఎకరాకు 83 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. నిరుడూ భారీవర్షాలతో వేరుసెనగ దెబ్బతిని, పెద్ద సంఖ్యలో నష్టపోయారు. అయినా పెట్టుబడి రాయితీ కొందరికి మాత్రమే అందిందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాదీ కోలుకోలేని దెబ్బతిన్నామని, సాగు విస్తీర్ణంలో 70% పైనే నష్టం జరిగిందని పేర్కొంటున్నారు.
* పంట: వేరుసెనగ
* సాగు విస్తీర్ణం: 16,47,052 ఎకరాలు
* దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 70%
* నష్టానికి కారణం: భారీ వర్షాలు
* సగటు దిగుబడి: అధికశాతం రైతులకు పంటకు చేతికే రాలేదు
* పెట్టుబడి నష్టం: రూ.2,882 కోట్లు అంచనా (ఎకరాకు రూ.25వేల చొప్పున)
అయిదెకరాల్లో వేరుసెనగకు రూ.2 లక్షల పెట్టుబడి అయింది. ఊడలు దిగినప్పట్నుంచే ఎడతెరిపిలేని వానలు పడ్డాయి. పంట సరిగా రాలేదు. కోత కోశాక 20 రోజులపాటు ఆగకుండా వర్షాలు కురిశాయి. కాసిన కొద్దిపాటి కాయలూ నల్లగా మారి మొలకలొచ్చాయి. కనీసం పశువుల మేత కూడా దక్కలేదు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. - పసల రాము, రైతు, మేడాపురం, చెన్నేకొత్తపల్లి మండలం, అనంతపురం జిల్లా
తామర దెబ్బకు తలకిందులు
మిరపలో ఏటా వైరస్ ప్రభావం ఉంటుంది. ఒక్కోసారి మొక్క దశలోనే ఆశిస్తే.. కొన్నిసార్లు తొలి కాపు తర్వాత, రెండో కాపులో వస్తుంటుంది. దీంతో ఎకరాకు పది క్వింటాళ్ల లోపైనా చేతికొచ్చేది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సాగు చేశారు. డిసెంబర్ నాటికే ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇంతలో జెమిని వైరస్ ఆశించి, కొంత నష్టపరిచింది. దీనికితోడు నల్లతామర పురుగు విజృంభించి మొత్తం పంటనే నాశనం చేసింది. పొలాల్లో పూత అనేదే కనిపించని పరిస్థితి. ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోయారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.30 వేలకు పైగా అదనపు నష్టం వాటిల్లింది. ఇప్పటికీ పురుగు నివారణ కాలేదు. సాగు చేసిన విస్తీర్ణంలో 80 నుంచి 85 శాతం మిరప దెబ్బతింది. మిరపలో గతేడాదీ వైరస్ ప్రభావంతో దిగుబడి తగ్గింది. ధరలు బాగుండటంతో రైతులు కొంత గట్టెక్కారు.
* పంట: మిరప
* సాగు విస్తీర్ణం: 5,13,000 ఎకరాలు
* దెబ్బతిన్న విస్తీర్ణం: సుమారు 85 శాతం
* ఎకరాకు సగటు దిగుబడి: 10 క్వింటాళ్లు
* ప్రస్తుతం వస్తున్నది: రెండు మూడు క్వింటాళ్లే
* పెట్టుబడి నష్టం: రూ.4,360 కోట్లు (ఎకరాకు రూ.లక్ష) అంచనా
నాలుగెకరాల మిరప.. రూ.5 లక్షల అప్పు
నాలుగెకరాల్లో మిరప వేశాను. నల్లతామర పురుగుతో దెబ్బతింది. రెండెకరాల్లో పంట తీసేసి బెండ, మునగ పెట్టా. మిగిలిన రెండెకరాల్లోనూ.. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లే వచ్చేట్లు ఉన్నాయి. కౌలుతో కలిపి నాలుగెకరాలకు రూ.6 లక్షల పెట్టుబడి అయింది. కాయలు అమ్మితే రూ.లక్ష వస్తాయేమో. - జాగర్లమూడి శ్రీను, మక్కెనవారిపాలెం, సంతమాగులూరు మండలం, ప్రకాశం జిల్లా
వెర్రి తెగులొచ్చి.. కంది పోయింది
భారీవర్షాలతో కందిలోనూ పూత రాలింది. మిగిలిన కొద్దిపాటి పూత అయినా నిలిస్తే ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లయినా కందులొస్తాయి అనుకుంటుండగా వెర్రితెగులు విరుచుకుపడి, కాపు అనేదే లేకుండా చేసింది. 70% విస్తీర్ణంలో దిగుబడుల్ని దెబ్బతీసింది. పెట్టిన పెట్టుబడి మొత్తం నష్టపోవాల్సి వస్తోంది. పూత ఎందుకు రావడం లేదో అర్థంకాక.. లీటర్ల కొద్దీ మందులు పిచికారీ చేస్తున్న రైతులకు పెట్టుబడి మరింత పెరుగుతోంది.
* పంట: కంది
* సాగు విస్తీర్ణం: 6,13,885 ఎకరాలు
* తెగులు, వర్షాలతో దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 60 శాతం పైనే
* ఎకరాకు సగటు దిగుబడి: 4 క్వింటాళ్లు
* ఇప్పుడు వస్తున్నది: క్వింటాలు లోపే
* పెట్టుబడి నష్టం: రూ.1,150 కోట్లు (ఎకరాకు రూ.25 వేల చొప్పున) అంచనా
కంది పంట నాశనం
వరిసాగులో నష్టాలొస్తున్నాయని అయిదెకరాల్లో కంది సాగు చేశా. రూ.75 వేల పైనే పెట్టుబడి పెట్టా. అధిక వర్షాలతో కొంత దెబ్బతింది. తెగుళ్లు పెరగడంతో.. ఎన్ని రకాల పురుగుమందులు వాడినా ఉపయోగం లేకపోయింది. మూడెకరాల కందిని గొర్రెల మేతకు ఇచ్చేశా. ఇంకో రెండెకరాల్లో ఉన్న కందికి వెర్రి తెగులు వచ్చింది. కాయ కూడా వచ్చే పరిస్థితి లేదు. - గాడపర్తి లక్ష్మినారాయణ, రైతు, శివరాంపురం, తాళ్లూరు మండలం, ప్రకాశం జిల్లా
వరి రైతుకు మిగిలింది కన్నీరే
ఖరీఫ్ నుంచి విడవని వర్షాలే. అయినా తట్టుకుని వరి సాగు చేస్తే పంటకోత దశలో వానలు విరుచుకుపడ్డాయి. కొన్నిచోట్ల పంటను తుడిచిపెట్టేశాయి. మరికొన్ని ప్రాంతాల్లో వరిని నేల కరిపించాయి. వచ్చే దిగుబడితో పోలిస్తే.. కోత ఖర్చులే ఎక్కువవడంతో కొంతమంది కోయకుండా వదిలేశారు. కోసి ఆరబెట్టిన ధాన్యమూ తడిసి, నీటిలో నాని, రంగు మారింది. నూక శాతమూ పెరిగింది. మిల్లర్లు కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధర వచ్చేవరకు ఎదురుచూద్దామంటే నిల్వ చేసుకునే చోటు లేక, రబీ పెట్టుబడులకు సొమ్ము అవసరమై అడిగిన ధరకు అమ్మాల్సి వస్తోందని వాపోతున్నారు. గతేడాది ఖరీఫ్‌లోనూ భారీవర్షాలకు రాష్ట్రంలో చాలాచోట్ల వరి దెబ్బతింది. ఈ ఏడాదీ తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు, కృష్ణా, చిత్తూరు, తదితర జిల్లాల్లో భారీగా పంట వర్షార్పణమైంది.
* పంట: వరి
* సాగు విస్తీర్ణం: 39,15,205 ఎకరాలు
* పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న విస్తీర్ణం అంచనా: సుమారు 40%
* ఎకరాకు సగటు దిగుబడి: 35 బస్తాలు
* సగటున వస్తున్నది: 20 బస్తాలు
* పెట్టుబడి నష్టం: రూ.2,250 కోట్లు (ఎకరాకు రూ.15,000) అంచనా
పెట్టుబడి కూడా దక్కదు
-కొప్పినీడి సత్యనారాయణ, కౌలు రైతు, శివకోటి, రాజోలు మండలం, తూర్పుగోదావరి జిల్లా
కౌలుకు మూడెకరాలు సాగు చేశాను. తుపాను, వర్షాలకు చాలా వరకు పంట దెబ్బతినగా 50 బస్తాల ధాన్యం చేతికొచ్చింది. ఎకరాకు 30 వేలు పైనే ఖర్చు చేశాను. పెట్టుబడీ తిరిగివచ్చేలా లేదు. ఇలాంటి పరిస్థితి ఏనాడూ రాలేదు.
అన్ని పంటలకూ నష్టాలే మిగిలాయి
సాగు చేసిన మిరపలో 95% వరకు నల్లతామర పురుగుతో దెబ్బతింది. వరి సాగు గిట్టుబాటు కాకపోవడంతో 25% మంది నాట్లే వేయలేదు. వేసిన పంటలోనూ ఎకరాకు 25 బస్తాలు మించి రావడం లేదు. వర్షాలతో కొంత తడిసింది. రంగు మారింది. యంత్రాలతో కోయించడంతో తేమ శాతం పెరిగింది. పత్తిలో గులాబీ పురుగు దెబ్బకు 70% పైనే నష్టం వస్తుంది. వేరుసెనగ 80% పైనే దెబ్బతింది. కందీ, మినుముకూ నష్టాలే. సెనగ, సుబాబుల్, జామాయిల్, సరుగుడులకు ధర లేదు. - కేవీవీ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
ఇదీ చదవండి: