రాష్ట్రంలో మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకూ రెండు సూట్ కేసుల విధానం నడుస్తోందని మాజీమంత్రి జవహర్ ఆరోపించారు. ఒక సూట్ కేసు ధనం నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్తుంటే... మరొకటి ప్రభుత్వ ఖజానాకు జమవుతోందని ధ్వజమెత్తారు. "మానవ బలహీనతల్ని సొమ్ము చేసుకోవటం జగన్‌రెడ్డికి తెలిసినంతగా మరెవరికీ తెలియదంటూ... ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చి, ఆ మద్యాన్నే ప్రధాన ఆదాయ వనరుగా మార్చి వ్యాపారం చేస్తున్నారని జవహర్ మండిపడ్డారు.
భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టడం ఒక్క జగన్‌కే సాధ్యమైందని విమర్శించారు. బ్రాండెడ్ కంపెనీలను రాష్ట్రంలోకి రానీయకుండా.. సొంత బ్రాండ్లను విస్తరింప చేస్తున్నారని అన్నారు. నాలుగు రూపాయల నుంచి 5 రూపాయలకే తయారయ్యే మద్యాన్ని 200 రూపాయలకు అమ్ముకుంటూ ప్రజల్ని దోచుకుంటున్నారని జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం తయారీకి అయ్యే ఖర్చు, పొందే లాభంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందనే తప్పుడు ప్రచారంతో... ప్రజల సొమ్మును తన ఖాతాలోకి జమేసుకుంటున్నారని ఆరోపించారు. మద్యాన్ని నిషేధించడం చేతకాకపోతే.. ప్రజలకు నాణ్యమైన మద్యాన్నైనా అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఇదీ చూడండి: murder: పెద్దమ్మ, పెద్దనాన్నల దగ్గరికి వచ్చాడు.. మూడు రోజుల తర్వాత..