ప్రభుత్వ ఉత్తర్వులంటూ నకిలీలు సృష్టించడం తీవ్రమైన నేరమని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవోను తయారు చేసిన నెల్లూరుకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. మాదాపూర్‌లో నివాసం ఉంటున్న నిందితుడు.. సీఏ పూర్తిచేసి ఓ కంపెనీలో పని చేస్తున్నాడు.
లాక్‌డౌన్‌పై గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోను డౌన్‌లోడ్ చేసుకుని.. తేదీలు మార్చి వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. సంజీవ్ స్నేహితులు నకిలీ జీవోను ఇతరులకు పంపారు. 1,800 వరకు ఫోన్‌లు పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేశామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. జీవోల పేరుతో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.