రాష్ట్రంలోని అప్పులపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్ట కథలు మానాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు హితవు పలికారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్ల నేడు ఎక్కువ అప్పులు చేయాల్సి వచ్చిందన్న బుగ్గన ప్రకటన అబద్ధమని ఆయన స్పష్టం చేశారు. కరోనా వల్ల రాబడులు తగ్గాయనేది కూడా వాస్తవం కాదని మండిపడ్డారు.
‘‘ప్రస్తుతం కరోనా కష్టకాలంలో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంతో పోలిస్తే.. నేడే ఎక్కువగా రెవెన్యూ రాబడులు వచ్చాయనేది అక్షర సత్యమన్నారు.'60 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం రూ.1.30 లక్షల కోట్లు అప్పు చేసి అనేక అభివృద్ధి పథకాలు అమలు చేసింది. 20 నెలల్లో జగన్ రూ.1.55 లక్షల కోట్లు అప్పు చేసి కూడా అభివృద్ధి ఏమీ చేయలేకపోయారు. సంక్షేమం సైతం ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఎక్కువేమీ చేయలేదు. రైతు రుణమాఫీ రద్దు, నిరుద్యోగ భృతి రద్దు, అన్న క్యాంటీన్ల రద్దు, చంద్రన్న బీమా రద్దు, పండుగ కానుకలు రద్దు, విదేశీ విద్య రద్దు.. ఇలా 34 సంక్షేమ పథకాలు రద్దు చేశారు’'' అని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రం చేసిన అప్పులు, రాష్ట్రానికి వచ్చిన రాబడులకు సంబంధించి యనమల ఓ నివేదిక విడదల చేశారు.
ఇదీ చదవండి