EX MINISTER DL RAVINDRA PIL: రూ.వెయ్యి కోట్ల ప్రజాధనం అక్రమాల విషయంలో ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీనుపై 2020 నవంబర్లో నమోదు చేసిన కేసులో సీఐడీ సక్రమంగా దర్యాప్తు చేయలేదని, ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. సీబీఐతోపాటు ఆప్కో మాజీ ఛైర్మన్ గుజ్జల శ్రీను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, చేనేతశాఖ ముఖ్య కార్యదర్శి, ఆప్కో ఎండీ, కేంద్ర చేనేత మంత్రిత్వశాఖ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు వేయాలని ఆదేశిస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ డీవీఎస్‌ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
చేనేత కార్మికుల పేర్లతో నకిలీ సంఘాలు, ఖాతాలు సృష్టించి సుమారు రూ.వెయ్యి కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డారని, ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ..చేనేత సంఘాల పేరుమీద రుణం తీసుకొని ఎగవేసిన సొమ్మును గుజ్జల శ్రీను నుంచి రాబట్టాలన్నారు. ఈ వ్యవహారంపై మంగళగిరి సీఐడీ పోలీసులు 2020 నవంబర్ 6న కేసు నమోదు చేసినా సక్రమంగా దర్యాప్తు చేయడంలో విఫలమయ్యారన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశించాలని కోరారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. రూ.వెయ్యి కోట్ల అక్రమాలపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది.
ఇవీ చదవండి: