డిజిటల్ మీడియా రంగంలో దూసుకెళుతున్న 'ఈటీవీ భారత్' అరుదైన ఘనత సాధించింది. దక్షిణాసియా బెస్ట్ డిజిటల్ న్యూస్ స్టార్టప్ అవార్డును గెలుచుకుంది. డిజిటల్ మీడియాలో ఉత్తమ ఆవిష్కరణలకు గాను... వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పబ్లిషర్స్ సంస్థ 'వాన్-ఇఫ్రా' ఈ పురస్కారాన్ని అందించింది. ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి చెరుకూరి దిల్లీలో అవార్డు అందుకున్నారు.
ది క్వింట్ వ్యవస్థాపక డైరెక్టర్ రీతూకపూర్ ఈ అవార్డు అందజేశారు. దాదాపు 100కు పైగా దేశాలకు చెందిన వివిధ వార్తాపత్రికలు, న్యూస్ ఏజెన్సీలు, పబ్లిషింగ్ సంస్థలు వాన్లో సభ్యత్వం కలిగి ఉన్నాయి. వాన్-ఇఫ్రా దక్షిణాసియా డిజిటల్ మీడియా-2020 సదస్సును దిల్లీలో నిర్వహిస్తోంది. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు సదస్సు జరగనుంది. డిజిటల్ మీడియా విస్తృతి, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, మార్కెటింగ్ వంటి అంశాలపై రెండు రోజుల సదస్సులో చర్చిస్తారు.