Tollywood Drug Case News : టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి దృష్టి సారించింది. ఈ కేసులో తెలంగాణ ఎక్సైజ్ శాఖ సేకరించిన సమగ్ర వివరాలను తమకు సమర్పించాలని గురువారం లేఖ రాసింది. ఈ వ్యవహారానికి సంబంధించి 2017లోనే ఎక్సైజ్‌శాఖ పలువురు సినీతారల్ని పిలిచి విచారించింది. అయితే 12 కేసుల్లో ఏ ఒక్క అభియోగపత్రంలోనూ సినీప్రముఖుల పాత్రను ప్రస్తావించలేదు.
Tollywood Drug Case Updates : ఇదే వ్యవహారంపై గతంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. మాదకద్రవ్యాల కేసుల్లో సమగ్ర దర్యాప్తు చేసేందుకు ఎక్సైజ్‌శాఖకు తగినన్ని వనరులు లేనందున కేసును ఎన్‌సీబీ, ఈడీ, డీఆర్‌ఐలాంటి ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని కోరారు. మరోవైపు తాము దర్యాప్తు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని హైదరాబాద్ ఈడీ అధికారులు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు.
అలాగే కొద్దిరోజుల క్రితం పలువురు సినీ ప్రముఖుల్ని తమ కార్యాలయానికి పిలిచి వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి పిటిషన్‌పై ఇటీవలే కోర్టు విచారణ జరిపింది. ఎక్సైజ్ శాఖ తమకు ఈ కేసులకు సంబంధించి కీలకమైన డిజిటల్ రికార్డుల్ని అప్పగించలేదని ఈ సందర్భంగా ఈడీ న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ప్రధాన నిందితుడు కెల్విన్ జరిపిన వాట్సాప్ సంభాషణలు, ఆర్థిక లావాదేవీల గుట్టు తేల్చేందుకు ఈ డిజిటల్ రికార్డులే కీలకమని పేర్కొంది. దీంతో ఈడీ కోరిన వివరాల్ని అప్పగించాలని న్యాయస్థానం ఎక్సైజ్‌శాఖను ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఎక్సైజ్‌శాఖకు ఈడీ లేఖ రాసింది.