ఓటమి భయంతోనే రాజధాని పరిధిలోని మూడు మండలాల్లో వైకాపా ఎన్నికలు జరపడం లేదని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, ఎంపీ తమవారే ఉన్నా ఎందుకు ఎన్నికలు నిర్వహించలేకపోతున్నారని ఆయన నిలదీశారు. జగన్ ఇళ్లు, కార్యాలయం ఉన్న చోటే ఎన్నికలు లేకపోవటం విడ్డూరమని ఎద్దేవా చేశారు. జగన్ ఇంటి చుట్టపక్కల వారే వైకాపాకు ఓటేయరనే విషయం అర్థమయ్యే ఎన్నికలు నిర్వహించడమ లేదని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మాత్రమే ప్రజా వ్యతిరేకత ఉందని వైకాపా భ్రమ పడటం అవివేకమని ఆక్షేపించారు. జగన్ ప్రజల్ని అడిగిన ఒక్కఛాన్స్ అయిపోయిందన్న బుద్దా.... ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని మండిపడ్డారు. చుట్టూ తన సామాజిక వర్గాన్ని పెట్టుకుని ఇతర కులాల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్‌కు ఎక్కడిదని ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని కొల్లగొట్టేందుకు విజయసాయి నేతృత్వంలో మాస్టర్ ప్లాన్‌కి శ్రీకారం చుట్టారని ఆరోపించారు. జరుగుతున్న ప్రతీ స్కాంలో తనకు వాటా ఉంది కాబట్టే అధికారిక ప్రకటనలు కూడా విజయసాయి ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి:హోంమంత్రి ఎదుట వైకాపా కార్యకర్తల బాహాబాహీ