ఈ కేవైసీ ప్రక్రియను లబ్దిదారులు తప్పనిసరిగా పూర్తి చేయించుకోవాలని అధికారులు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలని రేషన్ డీలర్ల సంఘం కోరుతోంది.
సాంకేతికత తెలియని విశాఖ మన్యం గిరిపుత్రులు ఆధార్ ఈకేవైసి చేసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పాడేరులో మీసేవ, స్టేట్ బ్యాంక్, పోస్టాఫీస్, కంప్యూటర్ దుకాణాలు, జిరాక్స్ దుకాణాలు కిటకిటలాడుతున్నాయి.
ఏజెన్సీ మండల కేంద్రాల్లో చాలాచోట్ల ఆధార్ నమోదు కేంద్రాలు లేవు. పాడేరులో స్టేట్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్ వద్ద ఈ కేవైసి అనుసంధానం చేస్తున్నారు. స్టేట్ బ్యాంకులో తక్కువ మందికే ఆన్లైన్లో చేస్తున్నారు. మిగిలిన వారికి ఓ తేదీ ఇచ్చి ఆ రోజున రమ్మంటున్నారు. పాడేరు చేరుకోవాలంటే ఆటోలు, జీపులు, ఇతర ప్రయాణ సాధనాలతో పిల్లా పాపా పెద్ద కలిసి ఎంతో డబ్బులు వెచ్చించి వస్తున్నారు. వారికి సకాలంలో ఆధార్ వేలిముద్రల అనుసంధానం అవ్వక డబ్బులు ఖర్చు పెట్టుకుని పనులు అవ్వక తిరిగి వెళ్ళిపోతున్నారు. చాలామంది గిరిజనులకు సెల్ ఆపరేటింగ్ తెలియదు. అలాంటి వృద్ధులకు ఆధార్ అనుసంధానమనేది కష్టమే అవుతోంది.