Delhi Liquor Scam: దిల్లీ మద్యం ముడుపుల వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈడీ అధికారులు హైదరాబాద్‌లో వరుసగా సోదాలు నిర్వహించడమే కాకుండా ప్రముఖ వ్యాపారి వెన్నమనేని శ్రీనివాసరావును నిన్న తమ కార్యాలయానికి పిలిపించి దాదాపు ఏడు గంటలపాటు విచారించారు. దిల్లీ మద్యం సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడైన ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.
ED Raids In Hyderabad updates :ఇవాళ ఆయన చరవాణిని స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే దిల్లీకి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు శ్రీనివాస్‌రావుకు తెలిపారు. ఈడీ అధికారులు సెల్‌ఫోన్‌ను రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించి విశ్లేషించే పనిలో ఉన్నారు. గోరంట్ల అసోసియేట్స్‌లో ఈడీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి... కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలిస్తున్న క్రమంలో శ్రీనివాస్‌రావు వివరాలు బయటికొచ్చినట్లు సమాచారం.
ED Raids In Delhi Liquor Scam :శ్రీనివాస్‌రావును ప్రశ్నించి... పలు వివరాలను సేకరించారు. ఆయన బ్యాంకు ఖాతాల వివరాలను సైతం సేకరించారు. రాంచంద్ర పిల్లైని ఆదివారం సాయంత్రం ఈడీ కార్యాలయానికి పిలిపించి ఆరు గంటల పాటు ప్రశ్నించారు. రాంచంద్ర పిల్లై ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఇది వరకే రెండుసార్లు సోదాలు నిర్వహించారు. రాబిన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించారు. వీటి ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్న ఈడీ అధికారులు మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.
తాజాగా మద్యం ముడుపుల కేసు దర్యాప్తు చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. పెట్టుబడులు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? ఎక్కడికి చేరుకున్నాయో తెలుసుకోవడంలో ఈడీ అధికారులు సఫలమయ్యారని, త్వరలోనే మరికొందరు ప్రముఖులకు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో రాబోయే రోజుల్లో ఈ కేసు మరింత సంచలనాత్మకంగా మారుతుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి: