TRUE UP CHARGES రాష్ట్ర విద్యుత్ వినియోగదారులపై మరోసారి ఇంధన సర్దుబాటు భారం పడనుంది. వారి నుంచి 1,048.01 కోట్ల రూపాయలను వసూలు చేసుకోవడానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్‌సీలో డిస్కంలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ ప్రతిపాదనలపై సెప్టెంబర్ 7న ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జనవరి-మార్చి నెలల మధ్య వాస్తవ విద్యుత్ కొనుగోలు వ్యయం, ఈ వ్యవధిలో విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్‌సీ అనుమతించిన మొత్తాలకు మధ్య వ్యత్యాసాన్ని.. ట్రూ అప్ కింద వినియోగదారుల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరుతూ డిస్కంలు ఇటీవల పిటిషన్ దాఖలు చేశాయి.
ఇప్పటికే మూడో నియంత్రణ వ్యవధి సంబంధించిన ట్రూఅప్ ఛార్జీల భారం 2 వేల 910.74 కోట్ల రూపాయలను ప్రజలపై డిస్కంలు వేశాయి. ఈ మొత్తాన్ని జులై విద్యుత్ బిల్లు నుంచే వసూలు చేస్తున్నాయి. వినియోగదారులు ఈ భారాన్ని 36 నెలల పాటు భరించాల్సి ఉంది. అలాగే, విద్యుత్ టారిఫ్‌లో మార్పుల కారణంగా.. ఏప్రిల్ నుంచి పెంచిన విద్యుత్ ఛార్జీల రూపేణా ఏడాదిలో 14 వందల కోట్ల రూపాయల భారాన్ని వినియోగదారులు మోయాల్సి వస్తోంది.
ఫలితంగా విద్యుత్ బిల్లులు 20 నుంచి 30 శాతం పెరిగాయి. వీటికి అదనంగా మరోసారి ట్రూఅప్ ఛార్జీల భారం పడే ప్రమాదముంది. డిస్కంల ప్రతిపాదనలపై హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కమిషన్ కార్యాలయంలో అభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్లు తెలిపింది. నేరుగా విచారణకు హాజరుకాని పక్షంలో వెబ్‌లింక్ ద్వారా అభిప్రాయాలను తెలపాలని పేర్కొంది.
మూడు నెలల్లో 6 వేల 726.79 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను 3 వేల 509.31 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని.. దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ పేర్కొంది. యూనిట్‌కు సగటున 5.22 రూపాయలు వెచ్చించినట్లు తెలిపింది. ఇదే వ్యవధిలో 7 వేల 392.57 ఎంయూల విద్యుత్‌కు 3 వేల 146.58 కోట్ల రూపాయలు మాత్రమే విద్యుత్ కొనుగోలు కింద వార్షిక ఆదాయ అవసరాల నివేదికలో.. APERC అనుమతించింది. దీని ప్రకారం సగటున యూనిట్‌కు 4.28 రూపాయల వంతున మాత్రమే అవుతుంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం 362.73 కోట్ల రూపాయలను వినియోగదారుల నుంచి ట్రూఅప్ కింద వసూలు చేసుకోవడానికి అనుమతించాలని కోరింది.
తాము 6 వేల 541.76 ఎంయూల విద్యుత్‌ను 3 వేల 463.58 కోట్ల రూపాయలతో కొనుగోలు చేశామని.. యూనిట్ సగటు ధర 5.29 రూపాయల వంతున ఖర్చు చేసినట్లు తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ తెలిపింది. ఇదే వ్యవధిలో ఏపీఈఆర్‌సీ 6 వేల 231.44 ఎంయూల విద్యుత్‌కు... సగటున 4.56 రూపాయల వంతున... 2 వేల 843.33 కోట్ల రూపాయలు మాత్రమే ఏఆర్‌ఆర్‌లో అనుమతించింది. తాము 620.29 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసినట్లు ప్రతిపాదనలో పేర్కొంది.
3 నెలల్లో 3 వేల 842.03 ఎంయూల విద్యుత్‌కు 2 వేల 57.38 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు.. కేంద్ర విద్యుత్ పంపిణీ సంస్థ పేర్కొంది. యూనిట్‌కు సగటున 5.35 రూపాయలు చెల్లించామని తెలిపింది. ఇదే వ్యవధిలో ఈఆర్‌సీ విద్యుత్ కొనుగోలుకు అనుమతించిన 4 వేల 15.26 ఎంయూల కొనుగోలుకు సగటున 4.96 రూపాయల వంతున19 వందల 92.39 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఈ మేరకు అదనంగా చేసిన వ్యయం 64.99 కోట్ల రూపాయలను ట్రూఅప్ కింద వసూలుకు అనుమతించాలని కోరింది.
ఇవీ చదవండి: