అమరావతిలో ఎక్కడా కుంభకోణం జరగలేదని.. అసలు స్కాం అంతా విశాఖ రాజధానిగా ప్రకటించాకే జరిగిందని తెదేపా సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన 72 జీవో ద్వారా 15వేల నుంచి 20వేల కోట్ల రూపాయల భూమిని అయినవారికి కట్టబెట్టే కుట్ర దాగి ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఆ జీవో ద్వారా 6200 ఎకరాలను సేకరించిన ప్రభుత్వానికి.. 30నుంచి 40 లక్షల గజాలు సమకూరాయని వివరించారు. ఇందులో అవినీతి లేకుంటే నేరుగా ఆ భూమిని అభివృద్ధి చేసి పేదలకు ఎందుకివ్వలేదని నిలదీశారు.
అమరావతి రాజధాని భూములకు సంబంధించి 1వ నెంబర్ జీవో 2015లో వస్తే 41వ నెంబర్ జీవో ఏడాది తర్వాత 2016లో వచ్చిందని వివరించిన ధూళిపాళ్ల నరేంద్ర.. 41వ జీవో వల్ల అసైన్డ్ భూములు ఉన్న ఎస్సీ రైతులకు అదనంగా 200గజాల లబ్ధి జరిగిందే తప్ప నష్టం జరగలేదని స్పష్టం చేశారు. అమరావతిని గాలికొదిలేసి గాలి కబుర్లు చెప్తూ 6ఏళ్ల తర్వాత ఈ జగన్నాటకానికి తెరలేపారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండీ... 'ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు'