కరోనా నియంత్రణలో భాగంగా రాష్ట్రంలో పక్కాగా కర్ఫ్యూ అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. రాత్రి కర్ఫ్యూ అమలుపై పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ అమలు, అత్యవసర సేవలకు అనుమతి అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనుమతి లేని వారు రాత్రివేళ తిరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు.
దురుసుతనం వద్దు
రాత్రి 9గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ పటిష్ఠంగా అమలు చేయాలని ఆదేశించారు. కర్ఫ్యూ అమలులో పౌరులతో దురుసుగా ప్రవర్తించరాదని సూచించారు. జీవోలో స్పష్టంగా ఉన్నందున మినహాయింపు ఉన్నవారు సెల్ఫ్ ఐడెంటిటీ కార్డు చూపించాలని అన్నారు. పౌరులకు చైతన్యం కలిగించాలని కోరారు.
ఎస్ఈసీ ఆదేశాలే ఫైనల్
మున్సిపల్ ఎన్నికల ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం జారీచేసే ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. డీజీపీ కార్యాలయం నుంచి అడిషనల్ డీజీలు గోవింద్ సింగ్, జితేందర్, ఐజీలు నాగిరెడ్డి, స్టీఫెన్ రవీంద్ర, రాజేశ్ కుమార్, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ