లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విక్రయానికి ఆటకం కలిగించడం లేదని డీజీపీ గౌతం సవాంగ్ హైకోర్టులో ప్రమాణపత్రం దాఖలు చేశారు. భౌతిక దూరాన్ని పాటిస్తూ వ్యవసాయ పనుల్ని చేసుకునేందుకు అనుమతివ్వాలని క్షేత్ర స్థాయి సిబ్బందిని ఆదేశించామన్నారు. వ్యవసాయ కార్యకలాపాలకు ఇబ్బందులు కలిగించరాదని స్పష్టం చేశామన్నారు. వ్యవసాయ కార్యకలాపాలకు మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన చెన్నుపాటి సింగయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవలే విచారణ జరిపిన ఉన్నతన్యాయస్థానం... పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు డీజీపీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
ప్రమాణపత్రంలోని ముఖ్య విషయాలు...
⦁ లాక్‌డౌన్ విధింపు సందర్భంగా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది.
⦁ ప్రతి జిల్లాలో 1902 నంబరుకు వచ్చే ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాం.
⦁ నిత్యావసర వస్తువులు ప్రజలకు అందేలా తగు చర్యలు తీసుకుంటున్నాం.
⦁ అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద తనిఖీలు చేసి నిత్యావసర వస్తువులను రవాణా చేసే వాహనాల్ని అనుమతించాలని సిబ్బందిని ఆదేశించాం.
⦁ కేంద్రం ఇచ్చే ఆదేశాల్ని ఎప్పటికప్పుడు పాటిస్తున్నాం.
ఇదీ చదవండి :
కొత్తగా 10 కేసులు.. కొవిడ్ పాజిటివ్ బాధితుల సంఖ్య 483కు చేరిక