Development of industrial corridors: రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు సంబంధించి భూసేకరణ, ప్రాజెక్టు నివేదికల తయారీ, నీటి సరఫరా, విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులను 2022 సెప్టెంబరులోగా పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అధ్యక్షతన డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ), నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్టు (నిక్‌డిక్ట్) గురువారం నిర్వహించిన ‘జాతీయ పారిశ్రామికవాడల అభివృద్ధి’ కార్యక్రమంలో ఏపీఐఐసీ కార్యాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి అమర్‌నాథ్ మాట్లాడుతూ.. ‘చెన్నై-బెంగుళూరు (సీబీఐసీ), విశాఖ-చెన్నై (వీసీఐసీ), హైదరాబాద్-బెంగుళూరు (హెచ్‌బీఐసీ) పారిశ్రామిక కారిడార్లలో నిక్‌డిక్ట్ నిధులతో కృష్ణపట్నం, కొప్పర్తి, ఓర్వకల్, శ్రీకాళహస్తి-ఏర్పేడు పారిశ్రామిక వాడల్లో చేపట్టిన అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. మూడు పారిశ్రామికవాడల ద్వారా 2040 నాటికి 5.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కలుపుతూ 25 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ల ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు రానున్నాయి. విశాఖలోని నక్కపల్లి, గుట్టపాడు పారిశ్రామిక క్లస్టర్లలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు. దిల్లీలో జరిగిన సమావేశానికి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్ నేరుగా హాజరయ్యారు.
ఇవీ చూడండి: