తెలంగాణ శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో.. పద్మారావు మాస్క్ ధరించకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వల్లే కరోనా సోకిన పరిణామాలను ఒక ఉదాహరణగా వివరించారు. హైదరాబాద్లో ఉన్న వాళ్లకు కరోనా వైరస్ రాదని చెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుకే కొవిడ్ సోకడం ఆ సమయంలో చర్చనీయాంశమైంది.
మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ...
గతంలో పద్మారావు నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఆ సందర్భంగా ఉపసభాపతికి మంత్రి కేటీఆర్ మాస్క్ ఇచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు కరోనా రాదని చెప్పిన పద్మారావు మహమ్మారి బారిన పడ్డారు. అయినప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పద్మారావు వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉంటున్న ఆయన.. సోమవారం జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్నారు.
మాస్క్ లేకుండా ప్రజల్లోకి..
వైరస్ సోకి హోమ్ క్వారంటైన్లో ఉన్న పద్మారావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఫలహారం బండి ఊరేగింపు వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మాస్క్ ధరించకుండానే మళ్లీ ప్రజల్లో తిరిగి.. స్థానికులకు ఆందోళన కలిగించారు. ప్రజలకు జాగ్రత్తలు సూచించాల్సిన నేతలే ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి:
'సుప్రీం తీర్పు ఓ మైలురాయి.. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా మారాలి'