భూముల నిషిద్ధ జాబితాలో (22ఏ) నిర్దేశిత భూమి కాకుండా సర్వే నంబరును నమోదు చేస్తున్నారు. ఫలితంగా ఆ సర్వే నంబరులోని మిగిలిన పదుల సంఖ్యలోని పట్టా భూములకు రిజిస్ట్రేషన్లు జరగడంలేదు. న్యాయం కోసం బాధితులు కోర్టుల్లో వేస్తున్న వ్యాజ్యాలు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న ఈ సమస్యపై ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ తాజాగా జిల్లా కలెక్టర్లకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. కొందరు అధికారుల ఉదాసీనత కారణంగా ‘నిషిద్ధ’ సంకెళ్లలో వేలాది ఎకరాల భూములు చిక్కుకుంటున్నాయి.
ప్రభుత్వ, సీలింగ్, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, పరిశ్రమలు, ఇతర శాఖల భూముల వివరాలను ఈ జాబితాలోనికి చేర్చే విషయంలో చాలాచోట్ల జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఉద్యోగుల నుంచి వచ్చిన వివరాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిచూసుకోకుండానే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతున్నారు. దాంతో సమస్యలు పెరుగుతున్నాయి. 2015కు ముందు ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, సీలింగ్, వక్ఫ్ తదితర భూముల వివరాలను మండలం నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు ఎవరికి వారుగా సబ్‌రిజిస్ట్రార్లకు పంపేవారు. దీనివల్ల తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఈ వ్యవహారంపై వివిధ పిటిషన్లు దాఖలవగా హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారించి, నిర్ణీతస్థాయిలోని అధికారుల నుంచే జాబితాలు వెళ్లాలని ఆదేశించింది. నాటి నుంచి కేవలం కలెక్టర్లు, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు మాత్రమే నిషిద్ధ జాబితాపై నిర్ణయం తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రక్రియలో దారుణాలు జరుగుతున్నాయి. వీటిపై అందిన ఫిర్యాదులు, విజ్ఞప్తులు, క్షేత్రస్థాయి సమాచారాన్ని లోతుగా పరిశీలించి రిజిస్ట్రేషను,్ల స్టాంపుల శాఖ ఐజీ ఎం.శేషగిరిబాబు సమగ్ర నివేదిక తయారు చేశారు.
దీన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌భార్గవ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 22-ఎ(1)(ఎ) నుంచి (ఈ) వరకు ఉన్న కేటగిరీల్లోని భూములు అనవసరంగా నిషిద్ధ జాబితాలోకి వస్తున్నాయని, అన్నింటినీ సరిచేయాలని సూచించారు. మరోవైపు భూ పరిపాలన శాఖ ప్రధాన కార్యాలయం కూడా నిషిద్ధ భూముల వివరాలను వెలికి తీస్తోంది.
ఒక సమస్యతో రిజిస్ట్రేషన్లు ఆగుతున్నాయ్
* తిరుపతిలోని అవివాల గ్రామ పరిధిలో సర్వే నంబరు 147 పరిధిలో ఉన్న భూములను దేవాదాయ శాఖ నుంచి స్థానికులు వేలంలో కొన్నారు. అయితే మొత్తం సర్వే నంబరును నిషిద్ధ జాబితాలోచేర్చారు. ఇక్కడక్రయవిక్రయాలన్నీ ఆగాయి.
* కర్నూలు జిల్లా ఎర్రగుంట్ల గ్రామ పరిధిలో 25 ఏళ్ల కిందట శివాలయం పరిధిలోని భూములను అధికారులే వేలంలో విక్రయించారు. ఇక్కడి భూములు కూడా నిషిద్ధ జాబితాలో ఉన్నాయి.
* విశాఖలోని మద్దిలపాలెం, రేసపువానిపాలెం, ఇతరచోట్ల పేద, మధ్య తరగతి వర్గాల వారికి చెందిన ఇళ్లు, ఇళ్ల స్థలాలను 22ఏ జాబితాలో చేర్చారు. దాంతో స్థానికులు ఏళ్లతరబడి అవస్థలు పడుతున్నారు.
* ప్రభుత్వం మార్కెట్ విలువలకు అనుగుణంగా భూములను పరిశ్రమలు, విద్యా, ఇతర సంస్థలకు అడపాదడపా విక్రయిస్తోంది. వీటిని నిషిద్ధ జాబితా నుంచి తొలగించాల్సి ఉన్నా... అలా జరగడంలేదు.
* ఇనాంల వ్యవస్థ రద్దయి రైత్వారీ విధానం అమలోకి వచ్చినా భూములు మాత్రం నిషిద్ధ జాబితాలోనే ఉంటున్నాయి.
* మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వమిచ్చిన భూములను పదేళ్ల తర్వాత విక్రయించుకోవచ్చు. గడువు ముగిసినా... అవి నిషిద్ధ జాబితాలోనే ఉంటున్నాయి. చిత్తూరు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉన్నాయి.
* రోడ్ల పక్కనున్న భూములను ప్రభుత్వం సేకరించినప్పుడు వీటిని 22ఎ జాబితాలో చేరుస్తున్నారు. అయితే... సర్వే నంబరు మొత్తాన్ని రాస్తున్నందున మిగిలిన భూముల యజమానులు అల్లాడుతున్నారు.
జిల్లాలకు ప్రత్యేక నమూనాలు
నిషిద్ధ జాబితాలోని భూములను పునఃపరిశీలన చేయాలని జిల్లా అధికారులను ప్రభుత్వం ఇటీవల ఆదేశించింది. దీనికోసం భూపరిపాలన శాఖ ప్రత్యేక నమూనాలను పంపింది. ఇది పక్కాగా జరిగితే... ఏళ్ల తరబడి కష్టపడుతున్న బాధితులకు ఊరట లభిస్తుంది. ఇదే సమయంలో విశాఖలో నిషిద్ధ జాబితాలో ఉన్న విలువైన భూములను తమ పలుకుబడితో బయటకు తెచ్చేందుకు పలువురు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలాంటిచోట్ల ప్రభుత్వం అప్రమత్తంగా లేకుంటే... అక్రమార్కులు లబ్ధి పొందే అవకాశముంది.
ఇదీ చదవండి: