Daughter in law attack on his father in law: తెలంగాణలోని వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండటం చెన్నూరుకు చెందిన కావలి పెద్దరాములు (52) కుమారుడు.. అదే గ్రామానికి చెందిన యువతిని 6 నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లయ్యాక రెండు నెలలు హైదరాబాదులో కూలీ పనులు చేసుకుంటూ జీవించారు. అతను తాగుడుకు బానిస కావడంతో తిరిగి ఇద్దరూ గ్రామానికి వచ్చారు. ఇంట్లో ఉంటున్న కోడలిపై మామ పెద్ద రాములు కన్నేశాడు. అప్పుడప్పుడూ లైంగిక వేధింపులకు పాల్పడుతుండేవాడు. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పినా నమ్మలేదు. దీంతో మామ చేష్టలను సీక్రెట్‌గా వీడియోలో రికార్డు చేసింది.
ఇదిలా ఉండగా.. సోమవారం(మే 16న) ఉదయం 11 గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లిన కోడలితో మామ మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే.. ఆమె తన తమ్ముడు శివకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేసింది. తమ్ముడు వచ్చిన తర్వాత ఆమె కర్రతో రాములును కొట్టింది. అనంతరం శివ.. గోపాల్‌పేట పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చాడు. వెంటనే పోలీసులు వెళ్లి రాములును తీసుకువచ్చి స్థానిక పీహెచ్‌సీలో చికిత్స చేయించారు. అనంతరం ఠాణాలో కూర్చోబెట్టారు. దెబ్బలకు తట్టుకోలేని రాములు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయాస పడుతుండటంతో చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి రాములు అప్పటికే మృతి చెందాడని నిర్ధరించారు.
ఈ సంఘటనపై అన్ని కోణాల్లో విచారణ చేయిస్తామని ఇన్‌ఛార్జి ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ తెలిపారు. సంఘటనకు సంబంధించి పెద్ద రాములు కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నామని, మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు అప్పగించామని చెప్పారు. ఈ ఘటనపై మంగళవారం ఉదయం సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం జరిగిందని, పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలా ప్రచారానికి పాల్పడిన వారిని గుర్తించి ఐటీ, ఐపీసీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.
ఇదిలా ఉంటే.. పెద్ద రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం చెన్నూరుకు తరలించగా ఉద్రిక్తత నెలకొంది. అతని మృతికి కారణమైన కోడలి ఇంటిని బంధువులు, కుటుంబసభ్యులు ధ్వంసం చేశారు. మృతదేహాన్ని అక్కడే ఉంచి నిరసన తెలపడంతో పాటు నిందితురాలి తల్లి, చెల్లెలిని కొట్టారు. పోలీసులు వెంటనే వారిని గ్రామపంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి ఉంచగా, వారిని బయటకు పంపాలని మృతుని బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రత్యేక పోలీసు బలగాలు వచ్చిన తర్వాత వారిని గోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు తరలించి అక్కడ చికిత్స చేయించారు. సాయంత్రం రాములు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఏఎస్పీ షాకీర్ హుసేన్ చెన్నూరులో ఉండి పరిస్థితిని చక్కదిద్దారు.
ఇవీ చూడండి: