గుంతల రోడ్లతో ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్థికంగా గుల్లవుతోంది. బస్సులు తరచూ మరమ్మతులకు గురవుతూ... వాటి మన్నిక కాలమూ తగ్గుతోంది. విడిభాగాలను పదేపదే మార్చాల్సి వస్తోంది. నిత్యం సగటున 4వేల లీటర్ల డీజిల్ అదనంగా ఖర్చవుతోంది. రాష్ట్రంలో కొన్ని జాతీయ రహదారులు మినహా, ఇతర రాష్ట్ర, జిల్లా రహదారుల్లో ఎక్కువ భాగం గుంతలమయం కావడమే ఇందుకు కారణం. ఆర్టీసీలో మొత్తం 11,800 బస్సులు ఉండగా, వీటిలో అద్దె బస్సులు 2,500 తీసేయగా మిగిలిన వాటిలో 80% ప్రస్తుతం నడుపుతున్నారు. గుంతల ప్రభావం వీటిపై ఎక్కువగా ఉంటోంది.
స్ప్రింగ్స్ ఎక్కువగా కొనుగోలు
* ప్రతి బస్‌లో లీఫ్ స్ప్రింగ్స్ కీలకమైనవి. బస్ బరువు ప్రభావం వీటిపై చూపుతుంది. అయితే గుంతల్లో దిగిన ప్రతిసారి వీటిపై అధికంగా ప్రభావం పడుతోంది. ఇటీవల కాలంలో స్ప్రింగ్స్ ఎక్కువగా విరిగిపోతున్నట్లు గుర్తించారు. లీఫ్ స్ప్రింగ్స్‌ను కిలోల లెక్కన కొనుగోలు చేసి, అన్ని డిపోలకు సరఫరా చేస్తుంటారు. ప్రతి లక్ష కిలోమీటర్లకు సగటున 10 కిలోల స్ప్రింగ్స్ చొప్పున గ్యారేజీల్లో వినియోగిస్తుంటారు. అయితే ఈ ఏడాది అంతకంటే ఎక్కువగా వినియోగిస్తున్నారు.
* కుదుపుల ప్రభావం ఛాసీపై కూడా ఉంటోంది. ఇలాగే ఎక్కువ కాలం గుంతలదారుల్లో బస్సులు వెళితే ఛాసీ జీవిత కాలం తగ్గిపోయి, పగుళ్లు వస్తాయని పేర్కొంటున్నారు.
* ఆర్టీసీలో సాధారణంగా ఓ కొత్త టైర్ లక్ష కి.మీ. వరకు నడుస్తుంది. తర్వాత రెండు సార్లు రీబటన్ చేయడం ద్వారా మరో లక్ష కి.మీ. వరకు అదనంగా వస్తుంది. మొత్తంగా సగటున ఒక టైర్ 2.10-2.20 లక్షల కి.మీ. మన్నుతుంది. గుంతల్లో పదేపదే దిగడంతో టైర్ మన్నిక సగటున 5-10 వేల కి.మీ. వరకు తగ్గుతోంది. కొన్నిసార్లు ఎక్కువగా దెబ్బతిని రీబటన్ చేయడానికి అవకాశం ఉండటంలేదు.
* అధ్వాన రహదారుల ప్రభావం బస్సుల మైలేజ్‌పైనా కనిపిస్తోంది. ప్రస్తుతం నిత్యం 29 లక్షల కి.మీ.ల మేర బస్సులు నడుపుతున్నారు. వీటిలో దాదాపు 10 లక్షల కి.మీ. గుంతలు ఉండే మార్గాల్లో ప్రయాణిస్తున్నాయి. సాధారణంగా ఓ లీటర్ డీజిల్‌కు సగటున 5.30 కి.మీ. మైలేజ్ వస్తుంది. అయితే గుంతల మార్గాల్లో వెళ్లే బస్సులకు పది పాయింట్లు తగ్గడంతో వాటిలో సగటున 5.20 కి.మీ.వరకే మైలేజ్ వస్తోంది. ఈ లెక్కన నిత్యం సగటున 4 వేల లీటర్ల వరకు అదనంగా డీజిల్ వినియోగించాల్సి వస్తోంది. ఈ పరిణామాలన్నీ సంస్థ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి.
ఇదీ చదవండి: RAHUL MURDER CASE : రాహుల్ హత్య కేసు... కీలక నిందితుల కోసం గాలింపు